హరీష్‌రావుకు హద్దులు నిర్దేశించగలిగినది ఎవరు? ఆయన హద్దు దాటడం ఏమిటి? అని మనకు సందేహాలు కలగడం సహజం. కానీ.. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో.. ఈ ఎన్నికల ప్రచారానికి తొలినుంచి దూరంగా ఉంటున్న తెరాస కీలక మంత్రి హరీష్‌రావు.. నగర హద్దుల్లోకి వచ్చి ప్రచారం నిర్వహించారు. అంటే మరేం లేదు. నగర శివార్లలోని పటాన్ చెరు ప్రాంతంలోని డివిజన్లలో హరీష్‌రావు ప్రచారం నిర్వహించారు.
నిజానికి గ్రేటర్ ఎన్నికలకు హరీష్‌రావు తొలినుంచి దూరంగానే ఉన్నారు. అలా అనడం కంటె పార్టీ (కేసీఆర్) ఆయనను దూరం పెట్టారని అంటే ఇంకా సబబుగా ఉంటుంది. గ్రేటర్ లో విజయం లభిస్తే.. ఆ క్రెడిట్ మొత్తం కేటీఆర్ యొక్క వన్‌మ్యాన్ షో అని చాటడానికా అన్నట్లుగా.. యువమంత్రి అన్నీ తానే అయి నడిపిస్తున్నారు. అయితే తొలిసారిగా హరీష్‌రావు.. మెదక్ జిల్లా పరిధిలోని పటాన్చెరు వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించడం విశేషం. మెదక్‌జిల్లా కు చెందిన హరీష్‌రావు .. తన ‘హద్దుల్లోకి’ వచ్చి ప్రచారం చేస్తున్నారంటూ పార్టీలో నాయకులు జోకులేసుకుంటున్నారు. అందుకే.. హరీష్‌రావు హద్దుల్లోనే ఉంటారా? లేదా, హద్దు దాటి.. నగరంలోకి కూడా ప్రవేశించి ప్రచారం నిర్వహిస్తారా? అనేది ఇప్పుడు చాలా కీలకాంశంగా మారుతున్నది.