టాలీవుడ్ కు సెంటిమెంట్లు ఎక్కువ. అలా అని ఆ సెంటిమెంట్లు కూడా ఉత్తుత్తినే రాలేదు. బోలెడు సార్లు ఒకేలా జరగడం చూసి, చూసి, సెంటిమెంట్లుగా డిసైడ్అయిపోయారు జనం. అఖిల్ సినిమా మిస్టర్ మజ్నును ఇలాంటి సెంటిమెంట్లు కొన్ని వెన్నాడుతున్నాయి. అందులో కీలకమైనది ఎఫ్ 2 సెంటిమెంట్.
అదేంటంటే, టాలీవుడ్ లో ఏదైనా బ్లాక్ బస్టర్ వస్తే, ఇక దానికి బ్రేక్ లు వుండవు. దాని తరువాత వచ్చే సినిమాలు అన్నీ, దీనికి సలాం అంటూ తలవంచుకుంటూ పక్కకు వెళ్లిపోతాయి. అది రంగస్థలం కావచ్చు, గీత గోవిందం కావచ్చు, ఇంకా చాలా హిట్ సినిమాలు కావచ్చు. ఇదే బాపతుగా వుంటుంది వ్యవహారం.
కనీసం నాలుగు వారాల పాటు నొల్లేసుకుని, ఇక చాలు కడుపునిండింది అనే వరకు ఆ బ్లాక్ బస్టర్ ఆడుతూనే వుంటుంది. అప్పుడు మళ్లీ మెల్లిగా మరో హిట్ అన్నది రావడం కద్దు. అలా అని ఇదే సెంటిమెంట్ పక్కా అని అనుకోవడానికి కూడా లేదు. ఎక్కువసార్లు ఇలా జరుగుతూవుంటుంది. తక్కువ సార్లు వెంటనే హిట్ రావచ్చు కూడా.
ఇక మజ్నుకు మరో సెంటిమెంట్ ఏమిటంటే, డైరక్టర్ రెండో సినిమా. మన తెలుగులో రెండో సినిమా గండం దాటిన డైరక్టర్లు ఓ పదిశాతం వుంటారంతే. మిగిలిన వాళ్లందరికీ ఇదే సమస్య. ఇక ఇంకో సెంటిమెంట్ ఏమిటంటే, నిధి అగర్వాల్. అన్న నాగ్ చైతన్య సరసన నటించి, డిజాస్టర్ ఇచ్చింది. మరి తమ్ముడు అఖిల్ కు హిట్ ఇస్తుందా? ఏం చేస్తుందీ అన్నది చూడాలి.
మిస్టర్ మజ్నుకు పాజిటివ్ సెంటిమెంట్లు కూడా వున్నాయి. దర్శకుడు వెంకీ అట్లూరి తొలిప్రేమ టైటిల్ రిపీట్ చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు మజ్ను టైటిల్ రిపీట్ చేస్తున్నాడు. అందువల్ల అదో పాజిటివ్ సైన్.
అయితే గత ఏడాది పండగ తరువాత వచ్చిన భాగమతి, దానికి కాస్త దూరంలో వచ్చిన ఛలో మంచి హిట్ లు అయ్యాయి. ఆ సెంటిమెంట్ లు కలిసి వస్తే మాత్రం మిస్టర్ మజ్ను పెద్ద హిట్ అయిపోతుంది.
ఈ సెంటిమెంట్లు ఎలా వున్నా, ఈ సినిమా హిట్ కావడం అన్నది హీరో అఖిల్ కు చాలా అవసరం. ఇప్పటికి రెండు సార్లు విజయం కోసం విఫలయత్నం చేసాడు. ఇది మూడోసారి. ఒకే ఇంట్లో ఇద్దరు స్వంత అన్నదమ్ములు పెద్ద హీరోలు కావడం అన్నది చిరంజీవి-పవన్ కళ్యాణ్ విషయంలోనే జరిగింది. మరే ఇంట్లోనూ సాధ్యం కాలేదు. మహేష్-రమేష్, అల్లరి నరేష్-ఆర్యన్ రాజేష్, బాలకృష్ణ-హరికృష్ణ, ఇలా చాలా జాబితానే వుంది. మరి అఖిల్ ఈ సెంటిమెంట్ ను కూడా అధిగమించి మంచి హీరో అనిపించుకుంటాడని ఆశిద్దాం.