ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై రోజుకో ఆరోపణ బయటకు వస్తోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలుస్తున్నారని బీజేపీపై చాలా రోజుల నుంచి వివిధ పక్షాలు ఆరోపిస్తున్నాయి. విపక్షాలు మాత్రమే కాకుండా.. బీజేపీకి చెందిన శివసేన లాంటి మిత్రపక్షాలు ఇవే ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా.. సయ్యద్ సుజీ అనే వ్యక్తి.. బీజేపీ తరపున తానే హ్యాకింగ్ చేశానని.. ఫలితాలను తన టీం మార్చిందని క్లెయిమ్ చేసుకున్నారు. ఆ ఆధారాలు అమెరికా ప్రభుత్వానికి ఇచ్చి.. ప్రాణభయంతో ఆ దేశ ఆశ్రయం కోరానని కూడా చెప్పుకొచ్చారు. ఇది దేశంలో కొత్త సంచలనం.
ఈవీఎంలను బీజేపీ సహా అందరూ వ్యతిరేకించారు..!
ఇటీవలి కాలంలో ఎన్నికల ఫలితాలు… అంచనాలకు అందకుండా వస్తున్నాయి. 2014 తర్వాత లోక్‌సభ స్థానాలకు జరిగిన ప్రతీ ఉపఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. కనీసం 12 స్థానాల్లో ఈ ఓటమి ఎదురయింది. కానీ అదే నేరుగా.. అన్ని చోట్లా … ఆయా రాష్ట్రాల్లో మొత్తం అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మాత్రం సంచలన విజయాలు నమోదు చేసింది. బీజేపీకి ఇంత వేవ్ ఉందా దేశ ప్రజలు ఆశ్చర్యపోయేలా ఫలితాలు వచ్చాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో బీజేపీకి తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఉపఎన్నికల్లో బీజేపీ కంచుకోటల్లో భారీ తేడాతో ఓడిపోయినప్పుడే బయటపడింది. కానీ.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం హోరాహోరీ అన్నట్లుగా వచ్చాయి. అప్పట్నుంచే విపక్షాలు మరింత దూకుడుగా ఈవీఎంలపై పోరాటం చేశాయి. నిజానికి బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. జీవీఎల్ నరసింహారావు.. ఈవీఎంల వల్ల దేశం ప్రమాదంలో పడిందని పుస్తకం కూడా రాశారు. దాన్ని బీజేపీ ప్రమోట్ చేసింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవీఎంలకు ఫ్యాన్‌గా మారిపోయింది. అవే మంచివని వాదిస్తోంది.
ట్యాంపరింగ్ చేయలేని టెక్నాలజీ లేదు..!
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు.. ఓ సెంట్రలైజ్డ్ నెట్ వర్క్ కాదు. సెంట్రలైజ్డ్ నెట్ వర్క్ కాదు కాబట్టి… ఓ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం, దేశం మొత్తం యూనిట్‌గా ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం. అయితే స్థానికంగా ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చా అనేది చాలా మందిలో వస్తున్న అనుమానం. ఇందులో మరో ముఖ్య విశేషం ఏమింటే..అభ్యర్థులు..వారి గుర్తులు. బరిలో ఎంత మంది అభ్యర్థులుంటారు.. వారికి ఏ గుర్తులు ఉంటాయో చివరి నిమిషంలో నే తెలుస్తుంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాతే.. బరిలో ఎంత మంది అభ్యర్థులు ఉన్నారనేది అప్పుడే తెలుతుంది. ఈ తేదీకి.. ఓటింగ్ తేదీకి మధ్య చాలా తక్కువ సమయం ఉంటుంది. అందు వల్ల ట్యాంపరింగ్ జరగాలన్నా… పెద్ద ఎత్తున అనేక స్థాయిల్లో కల్పించుకోవాలి. ఒకరో.. ఇద్దరో అధికారులు కల్పించుకుంటే అయ్యేది కాదు. అందువల్ల పెద్ద ఎత్తున.. అనేక మంది అధికారులు… కలిసి చేస్తే తప్ప.. ఈవీఎంలు ట్యాంపరింగ్ కావు.
ప్రజాభిప్రాయాన్ని మార్చేస్తే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు..!
ఈవీఎంలపై అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. ఎంత గొప్ప టెక్నాలజీ అయినా వంద శాతం ట్యాంపరింగ్ ఫ్రూఫ్ ఉంటుందా అని చెప్పలేం. ఆధార్ విషయంలోనే చూశాం. ఆధార్ పై ట్యాంపరింగ్ ఉండదనుకున్నాం. కానీ ఆధార్ విషయాలన్ని చాలా సులువుగా ట్యాంపర్ అవుతున్నాయి. అదే సమయంలో… టెక్నికల్‌గా ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయన్న అనుమానాలు ప్రజల్లోకి వస్తే.. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఓటర్లు పూర్తి స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటే.. ఓటింగ్ ప్రక్రియపైన ఓటర్లకు పూర్తి విశ్వాసం ఉండాలి. ప్రజల్లో అది లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. వీవీ ప్యాట్లు మర్చి నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నా.. లెక్కింపు మాత్రం చేయడం లేదు. ఫలితంగా ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోతోంది. బ్యాలెట్ పెడితే తప్ప.. ఏ ఎన్నికనూ ఎవరూ నమ్మలేని పరిస్థితి ఉంది.