వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓ ఎమ్మెల్యే చేరారు. ప్రతిపక్ష పార్టీల్లోకి ఎమ్మెల్యేలు సహజంగా.. ఎన్నికల ముందే చేరుతూంటారు. ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి.. గెలిపించిన పార్టీలో… మళ్లీ తనకు చాన్స్ రాదనుకోవడమో… అంతకు మించిన అవకాశం ఎదుటి పార్టీలో వస్తుందని… ఆశించడమో కానీ… ఎన్నికల ముందు ఆయారాం.. గయారాంలు ఎక్కువ మందే ఉంటారు. ఈ కోవలోని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి చేరారు. ఆయన నిన్నామొన్నటి దాకా.. చంద్రబాబు పిలిచి టిక్కెట్ ఇచ్చి.. నియోజకవర్గ అభివృద్ధికి అడిగినన్ని నిధులిచ్చారని.. అడిగని వారికి.. అడగని వారికి చెప్పుకుని.. సంతోషపడ్డారు. ఇప్పుడు వేరే మాటలు చెబుతున్నారు. వైసీపీలో చేరారు కాబట్టి.. అలా మాట్లాడాల్సిందే. మరి పార్టీ ఫిరాయింపులపై జగన్.. తన మాటలను.. తనకు అన్వయించుకుంటారా..?
ప్రభుత్వాన్ని పడగొడతానని రాజ్‌భవన్ ముందు తొడకొట్టిన ఫలితమో… జగన్ వ్యవహారశైలితో.. ముందు ముందు అధికారంలోకి రావడం కల్ల భావించడమో… ఇప్పుడు అధికారాన్ని అనుభవిద్దామనే ఆశతోనో… కానీ.. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు చోటు చేసుకున్నాయి.23 మంది ఎమ్మెల్యేలు చేరారు. నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరిగితే.. మరో 20 మంది వచ్చేవాళ్లని టీడీపీ నేతలు చెబుతూ ఉంటారు. ఈ చేరికలన్నింటినీ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన మీడియా కూడా.. చాలా ఘాటుగా విమర్శిస్తూ ఉంటుంది. వారు అమ్ముడు పోయారని… కొన్ని కోట్ల రూపాయల లెక్కలు చెబుతూ ఉంటుంది. సంతలో పశువుల్ని కొన్నట్లుగా… ఎమ్మెల్యేలను కొన్నారని జగన్ కూడా చెబుతూ ఉంటారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిందేమిటి..?
తెలుగుదేశం పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యేని తన పార్టీలో చేర్చుకున్నారు. ఆయనతో రాజీనామా చేయిస్తామని… ఇంకోటని చెప్పుకోవచ్చు. కానీ… మరో నెల రోజుల్లో ఎన్నికల ప్రకటన రాబోతున్న సమయంలో.. ఆయనతో రాజీనామా చేయించినా.. దానికి పెద్దగా విలువ ఏమీ ఉండదు. ఒక వేళ రాజీనామా చేయించినా.. ఫిరాయింపు .. ఫిరాయింపే..! మరి సంతలో పశువుని కొన్నట్లు.. జగన్ ఆ ఎమ్మెల్యేను కొనుగోలు చేశారా..?. ఆ ఎమ్మెల్యే అమ్ముడుపోయారా..?. తనకు అనుకూలమైన నీతి నియమాలు పెట్టుకుని… రాజకీయాలు చేయడం అంటే ఇదేనేమో..?