రాష్ట్రంలో ఫిరాయింపుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శించారు వైకాపా నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. విజయవాడ పార్టీ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేశారనీ, మరో ముగ్గురు ఎంపీలను కూడా దొంగిలించారని ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే.. తాము బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీకి వస్తామని చెప్పారు. నాయకుల పార్టీల మార్పులపై వైకాపా ధోరణి ఎలా ఉందంటే… టీడీపీ నుంచి వైకాపాలోకి ఎవరైనా నాయకుడు వస్తే, అది చంద్రబాబు పాలనపై విసిగిపోయి వచ్చినట్టట! వైకాపా నుంచి టీడీపీలోకి ఎవరైనా వెళ్తే… అది సంతలో పశువుల్ని కొనుగోలు చేసినట్టట!
ఇక, నవరత్నాల గురించి బుగ్గన మాట్లాడుతూ… ప్రతిపక్ష పార్టీ నవరత్నాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిందనీ, కానీ, వీటిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నారని విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అభివృద్ధి, సంక్షేమం అనేవి రెండు కళ్లుగా ఉండేవనీ, చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి, అక్రమాలు అన్నట్టుగా ఉందంటూ ఆరోపించారు. ఎన్నికలు దగ్గరపడుతూ ఉండటంతో ప్రజలను నమ్మించడానికి ఇప్పుడు కొత్త నాటకాలకు సీఎం తెరతీశారంటూ బుగ్గన విమర్శించారు.
వైకాపా నాయకుల మాటలను జాగ్రత్తగా గమనిస్తే… ప్రజల సమస్యలను వారి పార్టీకి లాభించే రత్నాలుగా చూస్తున్నారు. అందుకే, చంద్రబాబు వాటిని కాపీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజల సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి, బాధ్యతా ఉంటే… ఇలా మాట్లాడరు. ఏదేతైనేం, సమస్యల నుంచి ప్రజలు బయటపడినందుకు సంతోషిస్తున్నాం అనేవారు. పెన్షన్లను టీడీపీ ప్రభుత్వం రెండింతలు చేసిన దగ్గర్నుంచీ వైకాపా నేతల ధోరణిలో అక్కసు కనిపిస్తోందే తప్ప… ప్రజలకు జరిగిన మేలుపై సంతోషం అనేది వారి వ్యాఖ్యల్లో ఎక్కడా కనిపించడం లేదు. అయినా, నవరత్నాలను కాపీ కొట్టడం అనడమేంటి..? అంటే, వారు గుర్తించిన ప్రజాసమస్యలు వారివే అన్నమాట. ఇంకెవ్వరూ వాటి గురించి మాట్లాడకూడదు, పరిష్కరించకూడదు అనే మైండ్ సెట్ తో వైకాపా నేతలు ఉన్నారు. నవరత్నాల పేరుతో ప్రజల సమస్యలను తీర్చాలనే మంచి ఉద్దేశం కంటే, తాము అధికారంలోకి రావాలనే రాజకీయ లక్ష్యాన్నే బలంగా పెట్టుకున్నట్టున్నారు.