తెలుగుదేశం – జనసేన పార్టీలు మళ్లీ కలుస్తాయంటూ.. జరుగుతున్న రాజకీయ చర్చను.. టీజీ వెంకటేష్ .. మరో మెట్టు ఎక్కించారు. ఆయన ఏకంగా.. సీట్ల సర్దుబాటు చర్చల షెడ్యూల్ను ప్రకటించారు. మార్చిలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు చర్చలు జరుగుతాయని.. సీట్ల సర్దుబాటు జరుగుతుందని ఆయన సంచలనాత్మక ప్రకటన చేశారు. టీడీపీ, జనసేన మధ్య ఏం విబేధాలు లేవని.. కేంద్రంపై పోరాటం విషయంలో మాత్రం.. రెండు పార్టీలు విబేధించాయని.. ఇప్పుడు అది కూడా లేదన్నారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ కలవగా లేని.. ఏపీలో టీడీపీ, జనసేన కలవలేవా అని ఆయన లాజిక్కులు తీస్తున్నారు. చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు అమరావతికి వచ్చిన టీజీ వెంకటేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
వచ్చే ఎన్నికల్లో ఒక్క కమ్యూనిస్టులతో తప్ప.. ఎవరితోనూ పొత్తులు ఉండవని.. పవన్ కల్యాణ్ నేరుగా ప్రకటించినప్పటికీ… తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తులపై చర్చలు ఆగడం లేదు. పవన్ కల్యాణ్ కూడా ఇటీవలి కాలంలో.. టీడీపీపై విమర్శలు చేయడం లేదు. అలాగే.. టీడీపీ నేతలు కూడా.. జనసేన జోలికి వెళ్లడం లేదు. ఈ కారణంగానే రాజకీయవర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు… జనసేనతో తమతో కలసి రావాలని కోరుకుంటున్నది బహిరంగ రహస్యం. జనసేనకి ఆ ఉద్దేశం లేకపోతే.. గట్టిగా ఖండించాల్సింది. కానీ అలాంటి ప్రకటనలేమీ పెద్దగా రావడం లేదు. దీంతో.. టీడీపీ నేతలు మరింతగా… జనసేనను టార్గెట్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ డొలాయమానంలో ఉన్నారని.. ఆయనను గందరగోళానికి గురి చేసి .. తమ వైపునకు లాగాలని కోరుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ ఈ ట్రాప్లో పడకుండా ఉండాలంటే.. వెంటనే ఖండన ప్రకటనలు చేయాలని.. జనసేన నేతలు కోరుతున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ ఆలోచనలేమిటో.. ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయన కూడా ఒకటి , రెండు సందర్భాల్లో చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు చేయడంతో.. ఈ గందరగోళం పెరుగుతోంది. మరో వైపు కమ్యూనిస్టులు పొత్తు చర్చల కోసం.. ఎదురు చూస్తున్నారు. ఈ పరిణామాలు వారిలోనూ గందరగోళానికి గురి చేస్తున్నాయి.