ప్రియాంక గాంధీ కి తూర్పు ఉత్తర ప్రదేశ్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పదవి కేటాయిస్తూ, ప్రియాంక గాంధీ సోదరుడు కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీ ఈరోజు కీలక ప్రకటన చేశారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
పార్లమెంటు ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ ఎంత కీలకమైన దో అందరికీ తెలిసిందే. దాదాపు 80 ఎంపీ సీట్లు కలిగిన ఉత్తరప్రదేశ్ ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఏ ప్రభుత్వం రావాలో నిర్ణయించే రాష్ట్రంగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ రాష్ట్రాన్ని బిజెపి పరిపాలిస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ భారతీయ జనతా పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నాడు. కాబట్టి ఆయనను ఢీ కొట్టడానికి, ఉత్తరప్రదేశ్ ఫలితాలను మలుపు తిప్పడానికి రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతోంది.
ప్రియాంక గాంధీ వాద్రా గతంలో కూడా కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, ఆమె ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఉండకపోవడం వల్ల ఆమె కేవలం ప్రచార కర్తగానే కనిపించారు. అయితే ఇప్పుడు ఆమెకు ప్రముఖమైన పదవి కట్టబెట్టడం ద్వారా ఎన్నికల్లో ఆమె ప్రభావాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడినట్లు అర్థమవుతోంది.
మరి ప్రియాంక గాంధీ ప్రభావం 2019 ఎన్నికలలో ఏ విధంగా ఉంటుందో, ఉత్తరప్రదేశ్‌లో ఎంతవరకు ప్రభావం చూపుతుందో తెలియాలంటే మరి కొన్ని నెలలు వేచి చూడాలి