మార్చిలో జనసేనతో సీట్ల సర్దుబాటు చర్చలంటూ ప్రకటించిన… తెలుగుదేశం పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్ కు..పవన్ కల్యాణ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. పాడేరులో.. ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్న పవన్ కల్యాణ్… టీజీ ప్రకటనపై తీవ్రంగా స్పందించారు. టీజీ వెంకటేష్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదనన్నారు. జనసేన వద్దనుకుంటే టీజీకి రాజ్యసభ సీటు ఇచ్చారని గుర్తు చేశారు. టీజీ వెంకటేష్…పెద్దమనిషిగా మాట్లాడు లేదంటే తాను నోరు అదుపు తప్పి మాట్లాడుతానని హెచ్చరించారు. నేను నోరు విప్పితే మీరు ఏమవుతారో ఆలోచించుకోవాలన్నారు. కిడారి, సోమ చనిపోవడానికి చంద్రబాబే కారణం సభలో పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
మరో వైపు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై… చంద్రబాబు కూడా మండిపడ్డారు. టీజీ వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పాలసీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు సరికాదన్నారు. ఈ తరహా ప్రకటనలతో అయోమయానికి గురిచేయొద్దని మండిపడ్డారు. పార్టీ విధానాలపై కామెంట్లు చేసేటప్పుడు… నేతలు సంయమనం కోల్పోవద్దని చంద్రబాబు సూచించారు. ఎన్నికల తరుణంలో ఇలాంటి కామెంట్లతో గందరగోళం సృష్టిస్తే.. ఎవరికీ మంచిది కాదన్నారు. కొద్ది రోజులుగా.. టీడీపీ నేతలు పవన్ కలసి రావాలని ప్రకటనలు చేస్తున్నారు. దానికి కొనసాగింపుగా.. టీజీ వెంకటేష్.. పొత్తు పెట్టేసుకున్నట్లుగా ప్రకటించారు. దాంతో వివాదం ప్రారంభమయింది.
జనసేన.. తాము కమ్యూనిస్టులతో మాత్రమే పొత్తులు పెట్టుకుంటామని ప్రకటించింది. గతంలోపవన్ కల్యాణ్ ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. అయితే పవన్ కల్యాణ్ నేరుగా ఒక్క మాట కూడా చెప్పలేదు. పాడేరులో జరిగిన బహిరంగసభలో.. టీజీ వెంకటేష్ పై పవన్ కల్యాణ్ మండి పడ్డారు కానీ.. పొత్తుల విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. టీడీపీతో కలిసి పని చేసే ప్రశ్నే లేదని ప్రకటన చేసి ఉండే కాస్త క్లారిటీ ఉండేదని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. కానీ.. పవన్ ఆ మాట మాత్రం చెప్పలేదు.