ఆఫీసర్ డిజాస్టర్ తరువాత హీరో నాగ్ బాగా డల్ అయ్యారు. నానితో చేసిన మల్టీ స్టారర్ దేవ్ దాస్ కూడా మంచి ఫలితం ఏమీ ఇవ్వలేదు. దాంతో నాగ్ సినిమాలకు బాగా గ్యాప్ వచ్చింది. ఈ లోగా వేరే భాషల్లో సినిమాలు ఏవో చేస్తున్నారు కానీ మన జనాలకు వాటి వైనం పెద్దగా పట్టలేదు. బంగార్రాజు సినిమా, అలాగే రాహుల్ రవీంధ్రన్ డైరక్షన్ లో ఒక సినిమా చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఏది ముందు సెట్ మీదకు వెళ్తుందో క్లారిటీ లేదు.
ఇలాంటి నేపథ్యంలో మజ్ఞు ప్రమోషన్ ఇంటర్వూల్లో హీరో అఖిల్ తో మాట్లాడుతూ నాగ్ ఓ మాట చెప్పారు. అరవై రోజుల పాటు ఏకథాటిగా విదేశాల్లో షూటింగ్ కు వెళ్తున్నానని వెల్లడించారు. అయితే ఏ సినిమా, ఎవరు డైరక్షన్ అన్నది వెల్లడించలేదు. విదేశాల్లో షూటింగ్, ఏకథాటిగా మార్చి నుంచి అన్నదే చెప్పారు.
అంటే నాగ్ తరువాత సినిమా సెట్ మీదకు వెళ్లబోతోందని అర్థం అవుతోంది.
బంగార్రాజు సినిమా అయితే పల్లెటూరి నేపథ్యం వుంటుంది కానీ, ఫారిన్ షూటింగ్ వుండదు. వున్నా చాలా తక్కువ వుండే అవకాశం ఎక్కువ. అంటే ఈ లెక్కన రాహుల్ రవీంద్రన్ సినిమానే ముందు స్టార్ట్ చేస్తున్నారని అనుకోవాల్సి వస్తోంది.
కొద్ది రోజులు ఆగితే క్లారిటీ రావచ్చు.