‘మిస్టర్ మజ్ను’ ట్రైలర్ విడుదలైన దగ్గర్నుంచి అందరిలోనూ ఒక్కటే అనుమానం. ఈ సినిమాలో `ఆరెంజ్` లక్షణాలు కనిపిస్తున్నాయేంటి? అని. మిస్టర్ మజ్నులో హీరో క్యారెక్టర్‌కీ ఆరెంజ్‌లో చరణ్ క్యారెక్టర్‌కీ దగ్గర సంబంధాలున్నట్టు కనిపిస్తున్నాయి. ఇద్దరికీ ‘శాశ్వతమైన ప్రేమ’పై నమ్మకాలు ఉండవు. కథ కూడా అలానే ఉంటుందా? అంటూ అక్కినేని ఫ్యాన్స్ సైతం గారభా పడుతున్నారు. వీటిపై దర్శకుడు వెంకీ అట్లూరి క్లారిటీ ఇచ్చారు. ”ఆరెంజ్‌తో మా కథకు ఎలాంటి సంబంధం లేదు. హీరో క్యారెక్టరైజేషన్ విషయంలో అలా మాట్లాడుకుంటున్నారేమో. కేవలం తొలి 20 నిమిషాలూ… ప్లే బోయ్ లాంటి సన్నివేశాలుంటాయంతే. ఆ తరవాత అసలైన ప్రేమ కథ మొదలైపోతుంది. పాత ‘మజ్ను’కీ ఈ కథకూ కూడా పోలికలు ఉండవు. నవతరానికి నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. ముందు టైటిల్ అనుకునే కథ రాసుకున్నాను. పతాక సన్నివేశాల్లో అఖిల్ నటన అందరికీ నచ్చుతుంది. అఖిల్ అంటే ఇంత వరకూ డాన్సుల గురించి మాట్లాడుకున్నారు. ఇక మీదట నటుడిగానూ తన పేరు గుర్తు పెట్టుకుంటారు” అని భరోసా ఇచ్చేశాడు దర్శకుడు. రేపు ‘మిస్టర్ మజ్ను’ విడుదల అవుతుంది. ఈ సినిమాకి ఆరెంజ్ లక్షణాలు ఉన్నాయో లేదో ఇంకొన్ని గంటలు ఆగితే తెలిసిపోతుంది.