వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళగిరిలో నిర్మించుకుంటున్న ఇల్లు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. రెండు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో.. ఒకటి ఇల్లు.. మరొకటి పార్టీ కార్యాలయం విభాగాలుగా.. నిర్మితమవుతున్న “జగన్ భవన్ ” అసలు నిర్మాత…ఘట్టమనేని ఆదిశేషగరిరావు. ఈ విషయాన్ని ఆయనే అంగీకరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విబేధాలొచ్చి… ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరుతానంటూ… చంద్రబాబును కలిశారు. ఆ సమయంలో.. మీడియాతో మాట్లాడినప్పుడు.. జగన్కు మీరు ఇల్లు కట్టించి ఇస్తున్నారుగా.. టీడీపీలో ఎందుకు చేరుతున్నారని.. మీడియా ప్రశ్నించడంతో.. ఆయన ఉలిక్కి పడాల్సి వచ్చింది. కానీ.. అది వ్యాపారం అని కవర్ చేసుకున్నారు. వ్యాపారం వేరు.. రాజకీయం వేరు.. అని చెప్పుకొచ్చారు.
సూపర్ స్టార్ కృష్ణ సోదరుడైన ఆదిశేషగిరిరావు నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు. వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అప్పట్లో.. హైదరాబాద్ చుట్టుపక్కల రింగ్ రోడ్డు వంకర్లు.. భూముల వ్యవహారంలో… కొంత రగడ జరిగినా… తర్వాత సర్దుకుపోయింది. గత ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరాలని చూశారు. టిక్కెట్ రాకపోవడంతో.. జగన్ పంచన చేరారు. అప్పట్నుంచి జగన్తో సన్నిహితంగా ఉంటూనే వస్తున్నారు. అమరావతిలో జగన్ ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించినప్పుడు.. ముందుగా… ఆదిశేషగిరిరావే జగన్కు కనిపించారు. తాడేపల్లి సమీపంలో.. ఆదిశేషగిరిరావుకు భూములు ఉన్నట్లు తెలియడంతో.. రెండు ఎకరాల్లో ఇల్లు కట్టించి ఇవ్వాలని జగన్ కోరారు. దానికి.. ఆయన అంగీకరించి పని ప్రారంభించారు.
అయితే ఆ రెండేకరాలు.. వైసీపీకి విరాళంగా ఇచ్చారా.. లేక పవన్ కల్యాణ్ కొన్నట్లు… ఎకరానికి రూ. ఐదు లక్షల చొప్పున కొన్నారా అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. కానీ ఆశ్చర్యపోయే ధర మాత్రం కట్టారని అంటున్నారు. వైసీపీ వర్గాలు చెబుతున్న ప్రకారం.. జగన్ కు రెండు ఎకరాల్లో ఇల్లు కట్టించి ఇవ్వడం వల్ల.. ఆ చుట్టుపక్కల ఆదిశేషగిరిరావుకు ఉన్న భూములకు విలువ వస్తుంది కాబట్టి.. దానితో సర్దుకోమని.. జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే.. ఆదిశేషగిరిరావు.. జగన్ రెండెకరాలకు పెద్ద గోడ కట్టి.. లోపల “జగన్ భవన్ ” నిర్మణం చేపట్టారు. ఆ చుట్టుపక్కల విల్లాలు నిర్మిస్తున్నారు. వాటిని అమ్ముకుని… “జగన్ భవన్ ” కు పెట్టిన ఖర్చు రాబట్టుకోవాలన్నమాట. ఇది కూడా క్విడ్ ప్రో కో లానే ఉంది కదా..!