నాకు సంపాదన లేదు. మా ఆవిడే నన్ను పోషిస్తోంది. ఇది చంద్రబాబు తరచూ చెబుతూంటారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ ” ఆవిడ్నే ” నమ్ముకుంటున్నారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అభివృద్ధి నినాదాన్నే నమ్ముకోవడం లేదు. మళ్లీ గెలవడానికి అవసరమైన సంక్షేమాన్ని ఎవరూ ఊహించని రీతిలో ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు. దీనికి 1999 ప్లాన్ అమలు చేస్తున్నారు. 1999లో చంద్రబాబు రెండో సారి ముఖ్యమంత్రిగా గెలిచారు. అప్పట్లో.. ఆయన ప్రధానంగా మహిళలను ఆకట్టుకున్నారు. వారి ఓట్లు గంపగుత్తగా పడటంతో.. విజయం సాధించారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. మహిళలను ఆకట్టుకునేందుకు… కనీసం రూ. పదిహేను వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఓ రకంగా వారికి పంపిణీ ప్రారంభించేశారు.
దీపం టు డ్వాక్రా..! “ఆవిడ“కు అన్న అయ్యారా..?
ఎన్నికల రాజకీయాలు… కుల, మత, వర్గాల విభజనతో ఉంటాయి. అభివృద్ధి నినాదం ఎప్పుడూ… తక్కువ ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. అయితే ఏ ప్రలోభాలకు లొంగకుండా.. ప్రభుత్వం చేసే మంచిని గుర్తుంచుకునే వర్గం ఒకటి ఉంటుంది. ఆ వర్గమే మహిళలు. కుటుంబ భారం అంతా.. మహిళల మీదే ఎక్కువగా ఉంటుంది. వారికి వారి జీవితాన్ని ఎంత సులువు చేస్తే.. అంత పాజిటివ్‌గా స్పందిస్తారు. వారికి కులమతాల పట్టింపులు పెద్దగా ఉండవు. అందుకే చంద్రబాబు వీరి ఓటు బ్యాంక్‌పై దృష్టి పెట్టారు. చంద్రబాబు 1995లో మొదటి సారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పుడు మహిళల కోసం చేపట్టిన కార్యక్రమాలు వారి జీవితాల్లో వెలుగులు నింపాయి. అందులో మొదటిది డ్వాక్రా గ్రూపులు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు… స్వయం సహాయక గ్రూపులను ప్రొత్సహించారు. పెద్ద ఎత్తున చైతన్యం తీసుకొచ్చారు. ఆ తొమ్మిదేళ్లో డ్వాక్రా గ్రూపు.. ప్రతి ఊరిలోనూ ఏర్పడ్డాయి. ఆ గ్రూపులకు ఆర్థిక సాయం చేస్తూ… మహిళలు కుటుంబాలకు ఆర్థిక ఆదరవుగా మారేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక వారి జీవితాల్లో వెలుగులు నింపిన మరో పథకం.. దీపం. 1990లలో… వంట గ్యాస్ అంటే.. పట్టణాల్లోనూ అందరికీ అందుబాటులో ఉండేది కాదు. మధ్యతరగతి ప్రజలు కూడా కిరోసిన్, వంట చెరకు మీద ఆధారపడేవారు. ఇక పల్లెల సంగతి చెప్పనవసరం లేదు. వీరి బాధలు గమనించిన చంద్రబాబు దీపం పథకాన్ని ప్రవేశ పెట్టారు. అప్పట్లో గ్యాస్ కనెక్షన్ తీసుకోవడానికి .. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారికి భారంగా ఉండేది. వీరి వంటింటి కష్టాలు తీర్చేందుకు చంద్రబాబు.. దీపం పథకాన్ని తెచ్చారు. అప్పట్లో కేంద్రంలో… తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కీలక పాత్ర పోషించింది. వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉండటంలో చంద్రబాబు పాత్ర కీలకం. ఆ ప్రాముఖ్యతను.. ఉపయోగించుకుని చంద్రబాబు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున గ్యాస్ కనెషన్లు ఎపీకి మంజూరు చేయించుకోగలిగారు. ఫలితంగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో.. పేద, మధ్యతరగతి ప్రజల వంటింటి కష్టాలు తీరిపోయాయి. గ్యాస్ కనెక్షన్ కోసం డిపాజిట్ సొమ్ము రాయితీతో పాటు.. కట్టాల్సిన వాటిని కూడా కొంత కొంతగా వాయిదాల రూపంలో చెల్లించే అవకాశం ఇచ్చారు. అదో విప్లవాత్మక పథకంగా మారింది. పట్టణాలు, గ్రామాల్లో.. మహిళలు టీడీపీకి బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు రెండో సారి ముఖ్యమంత్రి అవడంలో మహిళలే కీలకం అయ్యారు.
కులమతాలకు అతీతమైన వర్గం మహిళలు..!
మహిళలు కులమతాల ప్రభావానికి అతీతంగా ఉంటారు. తమకు మేలు చేసిన వారికే ఓటు వేస్తారని… రాజకీయవర్గాలకు తెలుసు. అందుకే.. ఈ సారి చంద్రబాబు.. మరోసారి మహిళామణుల మనసు గెలుచుకోవడానికి … అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో పసుపు- కుంకుమ కింద… పదివేల రూపాయలు పంపిణీ చేశారు. రెండు, మూడు విడతలగా వాటిని వారికి అందించారు. డ్వాక్రా గ్రూపులకు ప్రొత్సహకాలు పెంచారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు మరోసారి నగదు రూపంలో వారికి లబ్ది చేకూర్చాలని నిర్ణయించారు. మరో సారి డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలందరికీ… ఒక్కొక్కరికి రూ. పదివేలు చొప్పున పంపిణీ చేయబోతున్నారు. ఇది మాత్రమే కాదు.. ఓ స్మార్ట్ ఫోన్ కూడా .. ప్రతి ఒక్కరికి చేర్చాలని నిర్ణయించుకున్నారు. స్మార్ట్ ఫోన్ తోనే రోజవారీ పనులు గడిచిపోతున్న ఈ యుగంలో పేద, మధ్య తరగతి మహిళలు.. ఈ విషయంలో వెనుకబడి ఉండకూడదన్న ఉద్దేశంతో… స్మార్ట్ ఫోన్ పథకానికి రూపకల్పన చేశారు. స్మార్ట్ ఫోన్ పంపిణీ చేయడమే కాకుండా.. కనీసం మూడేళ్ల పాటు ఉచితంగా డేటా కూడా.. అందించేలా పథకాన్ని సిద్దం చేశారు.
పథకాలన్నీ మహిళలకు చేరవ చేసింది అందుకేనా..?
తెలుగుదేశం ప్రభుత్వం.. చేపట్టే ప్రతి సంక్షేమ పథకం.. నేరుగా మహిళలను టార్గెట్ చేసుకునే ఉంటోంది. పండుగల సమయంలో .. పేద, మధ్య తరగతి వర్గాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల పండుగ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఆ విషయం పదవి చేపట్టిన వెంటనే గుర్తించిన చంద్రబాబు.. అన్ని వర్గాల పెద్ద పండుగలు.. అంటే.. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ లకు… కానుకలు పంపిణీ చేయడం ప్రారంభించారు. కుటుంబంలో మహిళలను ఈ పథకం విశేషంగా ఆకట్టుకుంది. ఇక సామాజికభద్రత పెన్షన్లు… ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఉన్న కుటుంబాల్లో ఓ వెలుగుని నింపాయి. ఆర్థిక బాథలు లేకుండా.. ఈ పెన్షన్లు చేశాయి. ప్రభుత్వం తరపున ఇచ్చే ఇళ్లు మహిళల పేరు మీదనే ఇస్తున్నారు. వారికే ఇంటిపై సర్వహక్కులు కల్పిస్తున్నారు. ఈ విషయం కూడా.. మహిళల్ని ఆకట్టుకుంటోంది.
“ఆమె” .. చంద్రన్నను మళ్లీ గెలిపిస్తుందా..?
చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు.. సంక్షేమ పథకాల లబ్దితో… మహిళల్లో ప్రభుత్వంపై… పూర్తిగా సానుకూల వాతావరణం ఏర్పడుతోందన్న భావన కలుగుతోంది. ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన వారు కులమతాలకు అతీతంగా ఓట్లు వేస్తారనే అంచనా మొదటి నుంచి అందుకే ప్రభుత్వం కూడా.. మహిళలకు మేలు చేయడానికి చేయాల్సినదందా చేస్తోంది.