ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. పొత్తులు లేకుండా.. అందరూ.. ఎవరి బలం వారు నిరూపిచుకోవాలని సిద్ధమయ్యారు. ఇప్పుడే ఆంధ్ర రాజకీయం రసవత్తరం కానుంది. తెలుగుదేశం పార్టీతో.. కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం లేదు. సీట్ల సర్దుబాటు చేసుకోవడం లేదు. కాంగ్రెస్, టీడీపీల మధ్య ఏమైనా స్నేహం ఉంటే.. అది ఢిల్లీ దగ్గరే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏపీలో మాత్రం.. ఎవరి దారి వారిదే.
ఏపీలో ఎవరి దారి వారిదే..!
కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంటరి పోటీ క్లారిటీ వచ్చిన గంటల్లోనే జనసేన పార్టీ నుంచి కూడా… ఇలాంటి ప్రకటనే వచ్చింది. సిట్యూయేషన్ డిమాండ్ చేయడంతో.. పవన్ కల్యాణ్ కూడా స్పందించక తప్పలేదు. కర్నూలు ఎంపీ టీజీ వెంకటేష్… జనసేనతో పొత్తు ఖరారయినట్లేననన్నట్లుగా మాట్లాడారు. మార్చిలో సీట్ల సర్దుబాటు చర్చలు ఉంటాయని ప్రకటించారు. ఇది… ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. గత కొంత కాలంగా.. జనసేన మళ్లీ .. తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతోందన్న ప్రచారం జరుగుతోంది. కలిస్తే తప్పేమిటని చంద్రబాబు కూడా ప్రశ్నించారు. కలసి రావాలని టీడీపీ నేతలందరూ ఆహ్వానిస్తున్నారు. ఇలాంటి సమయంలో.. ఒక అడుగు కాదు.. ఏకంగా పది అడుగులు ముందుకేసిన టీజీ వెంకటేష్ సీట్ల సర్దుబాటు ప్రకటన చేసేశారు. దీంతో.. ఇప్పటి వరకూ.. టీడీపీ నేతల ప్రకటనలను లైట్ తీసుకున్న పవన్ కల్యాణ్.. ఒక్క సారిగా బరస్టయ్యారు. పాడేరులో .. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు.. టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యల గురించి తెలుసుకుని… తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ స్పందనతో… ఆయన కూడా.. ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు తేలిపోయింది. కమ్యూనిస్టులతో మాత్రం పొత్తులు పెట్టుకుంటానని గతంలో చెప్పారు కాబట్టి… ఆ ప్రకారం కంటిన్యూ అయిపోయే అవకాశం ఉంది.
వైసీపీవన్నీ లోపాయికారీ పొత్తులే..!
ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకే మాట చెబుతోంది. ఈ మధ్య కాలంలో ఫెడరల్ ఫ్రంట్ కోసం… టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో చర్చలు జరిపినప్పిటకీ.. రెండు పార్టీలు కలసి నడవాలని భావించినప్పటికీ.. అది పొత్తే కానీ.. సీట్ల సర్దుబాటు వరకూ రాదు. తెలంగాణలో వైసీపీ పోటీ చేయదు.. ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేయదు కాబట్టి… ఆ పొత్తులు ఫెడరల్ ఫ్రంట్ వరకే ఉంటాయి. బీజేపీతో పొత్తంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లేనన్న క్లారిటీ ఉండటంతో.. ఆ ప్రచారాన్ని మొగ్గలోనే తెంపేశారు. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎవరూ లేరు. అంటే.. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ, పవన్ కల్యాణ్ జనసేన , కాంగ్రెస్, బీజేపీ అన్నీ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఈ సారి ఓటర్లకు… చాలా ఆప్షన్స్ కనిపించబోతున్నాయి.
అన్ని పార్టీలు పోటీ చేస్తే ఎవరికి అడ్వాంటేజ్..?
ఏపీలో ఎలాంటి కూటములు ఉండవని తేలిన తర్వాత.. ఇప్పుడు అందరికీ ఇదే సందేహం వస్తోంది. గత ఎన్నికల్లో.. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. జనసేన అభ్యర్థుల్ని నిలపలేదు కానీ… టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు మద్దతిచ్చింది. ఈ సారి అన్నీ విడిగా పోటీ చేయబోతున్నాయి. వైసీపీ గతంలోనూ ఒంటరిగా పోటీ చేసింది. ఇప్పుడూ అదే దారి. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. ఈ పార్టీలన్నింటినీ.. ఎవరికి వారికి స్థిరమైన ఓటు బ్యాంకులు ఉన్నాయి. బరిలో ఎక్కువ పార్టీలు ఉంటే.. అధికార పార్టీకి లాభిస్తుందని చెబుతూ ఉంటారు. దానికి కారణం… అధికారానికి వ్యతిరేకంగా.. నాలుగైదు ప్రత్యామ్నాయాలుంటే… ఓటర్లంతా.. ఆ నాలుగింటి వైపు చీలిపోతారు. ఉదాహరణకు ఆరు ఓట్లు ఉంటే.. రెండు ఓట్లు అధికార పార్టీకి వచ్చి.. మిగతా నాలుగు ఓట్లు నాలుగు పార్టీలకు పడితే.. అంతిమంగా.. విజయం అధికార పార్టీకే వస్తుంది. ఆరులో రెండే ఓట్లు వచ్చినప్పటికీ.. ఓట్ల చీలిక … అధికార పార్టీకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏపీలో ఇదే పరిస్థితి ఉంటుందని.. ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకులు.. అభిప్రాయపడుతున్నారు.
జగన్ ఆశలేంటి..? పవన్ అంచనాలేంటి..?
గత ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే… టీడీపీ కేవలం రెండు శాతం ఓట్లతోనే గెలిచిందని.. వైసీపీ నేతలు పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. తమ ఓట్లు తమకు పడతాయి.. బీజేపీ, జననసేన ఓట్లు టీడీపీకి మైనస్ అవుతాయి కాబట్టి గెలిచి తీరుతామని.. పొలిటికల్ కెమిస్ట్రి లెక్కలు బట్టీ పట్టీ మరీ చెబుతున్నారు. ఇక పవన్ కల్యాణ్ తమనే ప్రజలు ప్రత్యామ్నాయంగా భావిస్తారని నమ్ముతున్నారు. మార్పు కోసం వచ్చాననేది పవన్ పాలసీ. ఆయనకు ఓ బలమైన సామాజిక వర్గ యువత అండగా ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ.. కూడా.. చాలా ఆశలు పెట్టుకుంది. అంది వచ్చిన ప్రత్యేకహోదా అస్త్రంతో.. ప్రజల్లోకి వెళ్లి ఆదరణ పెంచుకోవాలని నిర్ణయించుకుంది. నిజానికి.. కాంగ్రెస్ పార్టీ.. విభజన ఎఫెక్ట్. జగన్మోహన్ రెడ్డి పార్టీని చీల్చి.. వైసీపీని పెట్టుకోవడంతో… కుదేలయిపోయింది. ఇక భారతీయ జనతా పార్టీ పోటీ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈవీఎంలలో నోటాతో పోటీ పడితే గొప్ప అన్నది.. అనేక సర్వేల్లో తేలిపోయింది. లోపాయికారీ పొత్తులు.. అవగాహనల గురించి పక్కన పెడితే.. .. ఏపీలో నాలుగు స్తంభాలాట ఖాయమైపోయింది. ఇది ఎవరికి కలిసొస్తుందనేది ఫలితాలే చెప్పాలి.