వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజుల నుంచి వైసీపీ అనుకూల ఓటర్ల పేర్లు తీసేస్తున్నారని.. సాక్షి పత్రిక ద్వారా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. కొన్ని సర్వే బృందాలను పట్టుకుని… వారితో వైసీపీ సానుభూతి పరుల ఓట్లను గుర్తించి… అక్కడికక్కడే డిలీట్ చేస్తున్నారని.. సాక్షి పత్రికలో పుంఖానుపుంఖాలుగా కథనాలు రాస్తున్నారు. వైసీపీ నేతలతో మాట్లాడి.. వాటినీ రాస్తున్నారు. వైసీపీ, సాక్షి వ్యవహారం చూస్తే.. వారి ఆందోళన మొత్తం రాబోయే ఓటమికి ముందుగానే.. కారణాలు వెదుక్కుంటున్నట్లుగా ఉందన్న అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఓటర్ల తొలగింపు.. సర్వే బృందాల చేతుల్లో ఉండదు. అసలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపు ఎందుకు ఉంటుందో ఎవరికీ అర్థం కావడంలేదు. కానీ సాక్షి మాత్రం తన వాదన తను వినిపిస్తూనే ఉంది.
నియోజకవర్గానికి పది వేల ఓట్ల తొలగింపే లక్ష్యంగా… సర్వే బృందాలు ఏపీలో తిరుగుతున్నాయనే ఓ కథనాన్ని సాక్షి పత్రిక రాసుకొచ్చింది. పది వేల ఓట్లు అంటే.. మామూలు విషయం కాదు. ఒకటి, రెండు వందల ఓట్లు తొలగిస్తేనే.. రచ్చ అయిపోతుంది. పైగా ఇప్పుడు ఓటర్ల జాబితా సిద్ధం చేశారు. ఆ ప్రతిని… ఆయా పార్టీలకు అందించారు. ఇలాంటి సమయంలో.. ఓట్ల తొలగింపు అంటే అసాధ్యమనే చెప్పుకోవాలి. నిజంగా.. అలా ఓట్లు లేని వాళ్లు.. కొన్ని రోజుల క్రితం.. ఉండి.. ఇప్పుడు ఓటు కోల్పోయిన వాళ్లు ఎవరైనా ఉంటే.. అలాంటి ఆధారాలను.. కనీసం వైసీపీ మీడియాలో అయినా ప్రకటించి.. తన వాదనకు మద్దతు సంపాదించుకోవచ్చు. కానీ.. ఓట్ల తొలగింపుపై.. ఇప్పటి వరకూ.. ఎలాంటి ఆరోపణలు, సాక్ష్యాలు లేకపోయినప్పటికీ.. వైసీపీ, సాక్షి మాత్రం… అదే వాదన పదే పదే వినిపిస్తూ ఉండటంతో.. ఓటమికి కారణాలు వెదుక్కుంటున్నారన్న అభిప్రాయం ఏర్పడిపోతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఓటర్ల జాబితాలో అవకతవకల్ని పక్కాగా పట్టుకుని కోర్టుకు వెళ్లారు. కానీ వైసీపీ నేతలు.. మాత్రం.. ఓటర్ల జాబితాలపై.. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడానికే ప్రయత్నాలు చేస్తోంది. న్యాయపోరాటం విషయంలో మాత్రం.. ఎలాంటి ఆసక్తి చూపించడం లేదు. అంతగా అవకతవకలు ఉన్నాయని భావిస్తే కోర్టుకెళ్లొచ్చు కదా..అని వస్తున్న విమర్శలకు కౌంటర్‌గా న్యాయపోరాటం కూడా చేస్తామని చెప్పుకొస్తున్నారు కానీ.. ఇంత వరకూ.. నిఖార్సుగా… ఓటర్ల జాబితాలో ఇవీ అవకతవకలు అని తన మీడియాలోనే ప్రకటించలేకపోయారు. ఆధార్ సీడింగ్ సహా… వివిధ కారణాలతో ఆరు నెలల కిందట.. పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించారు. ఆ తర్వాత.. ధరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇచ్చారు. ఇప్పుడు.. ఆ జాబితా రాజకీయ పార్టీలకు చేరింది. అవకతవకలు ఉంటే.. తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. కానీ.. వైసీపీ ఆలోచన మాత్రం వేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.