వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందిన ‘యాత్ర’ రాజకీయ చిత్రం కాదని దర్శకుడు మహి వి. రాఘవ్ అంటున్నారు. వైయస్సార్ రాజకీయ నాయకుడు కావచ్చు కానీ ‘యాత్ర’ మాత్రం రాజకీయ చిత్రం కాదనేది ఆయన మాట. అలాగే, ఈ చిత్రంతో వైయస్సార్సీపీకి లబ్ధి చేకూరుతుందని తాను అనుకోవడం లేదంటున్నారు.
ప్రజలు చాలా తెలివైన వారని, ఎవరికి ఓటు వేస్తే ఎంత లాభం అని లెక్కలు వేసుకుని మరీ ఓటేస్తారని, ఓ సినిమాతో ప్రభావితం అవుతారని తాను నమ్మడం లేదని తాజా ఇంటర్వ్యూలో మహి వి. రాఘవ్ వ్యాఖ్యానించారు. ఓ 30 ఏళ్ల క్రితం సినిమా చూసి ఓట్లు వేశారేమో కానీ, ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదన్నారు. ‘యాత్ర’ వైఎస్ఆర్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్సీపి పార్టీకి లబ్ది చేకూరుస్తుందని అనుకోవడం ఎక్కువగా ఊహించుకోవడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
‘యాత్ర’ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం కాదని మహి వి. రాఘవ్ అన్నారు. ఇదే ఇంటర్వ్యూలో డిసెంబర్ నెలలో విడుదల కావాల్సిన చిత్రాన్ని, ఫిబ్రవరికి వాయిదా వేయడానికి ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ అదే సమయంలో విడుదల అవుతుండటమే అన్నారు. అదేంటో మరి? తెలుగుదేశానికి ‘యాత్ర’ వ్యతిరేకం కాదు గానీ… తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సినిమా ఫిబ్రవరిలో సినిమా వస్తున్నందున తాము కూడా అప్పుడు వస్తున్నామని చెబుతున్నారు.
వైయస్సార్ గొప్పతనాన్ని చెప్పడానికి మరొకరిని పెట్టాల్సిన అవసరం లేదని, వైయస్సార్ ది అటువంటి లక్షణం కాదని మహి వి రాఘవ్ తెలిపారు. ‘యాత్ర’ కథలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి మార్పులు చేయలేదట. యాత్ర పోస్టర్ జగన్మోహన్ రెడ్డికి చూపించిన తరవాత వైయస్సార్ రైతు రుణమాఫీ చేసినట్టు చూపిస్తున్నాం అనగా… ‘నాన్నగారు చేయనివి చూపించ వద్దు’ అని జగన్ చెప్పారట. ‘వైయస్సార్ చేసినవి చూపిస్తే చాలు. కథ తెలుసుకుని తాను మార్పులు చేయడం తనకు నచ్చదు’ అని జగన్ అన్నారట.