ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో జనసేన పొత్తు కొనసాగుతుందనేది స్పష్టత వచ్చేసింది. పొత్తులో భాగంగా వారేమీ పెద్ద సంఖ్యలో సీట్లు అడిగే పరిస్థితి ఉండదనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక, రాష్ట్రంలోని 175 స్థానాల్లోనూ పోటీకి దిగుతున్నామని అధినేత పవన్ కల్యాణ్ ఎప్పట్నుంచో చెబుతున్నదే. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో… పవన్ వ్యూహం ఏంటనేది ఇంకా స్పష్టంగా వెల్లడించడం లేదు. జనసేన వర్గాల్లోనే ఈ మాట వినిపిస్తోంది. అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తారని జనసేన వర్గాలు చెబుతున్నా… పవన్ ఫోకస్ అంతా వంద నియోజక వర్గాలపై ఉంటుందనీ, వాటిని టార్గెట్ చేసుకునే ఆయన ఎన్నికలకు సిద్ధమౌతున్నారని తెలుస్తోంది. దీంతో, 175 స్థానాల్లో జనసేన కూటమి పోటీ ఉంటుందా లేదా అనే చర్చ కూడా ఇప్పుడు వినిపిస్తోంది.
తెలుగుదేశం, వైకాపా… ఈ రెండు పార్టీలపై ఎక్కువ వ్యతిరేకత ఎక్కడుంది అనే అంశం మీద పవన్ కల్యాణ్ తాజాగా ఒక అధ్యయనం చేయించారని సమాచారం. అధికార ప్రతిపక్షాలపై ప్రజల్లో అసంతృప్తి ఎక్కడైతే తీవ్రంగా ఉందో… ఆయా స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలనీ, అక్కడ తమకు గెలిచే అవకాశం కచ్చితంగా ఉంటుందనే అంచనాలను పవన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాతిపదికనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని భావిస్తున్నారు. జిల్లాలవారీగా చూసుకుంటే… ఉభయ గోదావరి జిల్లాల మీద పూర్తి శ్రద్ధపెడతారని సమాచారం. ఈ రెండు జిల్లాల్లో మొత్తం స్థానాలపై ఫోకస్ పెడతారట. ఇక, ఉత్తరాంధ్రకు వచ్చేసరికి.. మూడు జిల్లాలు కలిపి ఓ పాతిక నియోజక వర్గాల మీద జనసేన ఫోకస్ ఉంటుందట. రాజధాని ప్రాంతంతోపాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఓ పది స్థానాలపై శ్రద్ధ పెడతారని తెలుస్తోంది.
రాయలసీమలో కూడా ఇలానే జిల్లాలవారీగా కొన్ని అంచనాలు వేసుకుని… మొత్తంగా ఓ వంద స్థానాల్లో జనసేన కూటమి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే, ఆ వందమంది అభ్యర్థులైనా ఎవరు అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. కొంతమందిని జనసేనాని ఇప్పటికే సిద్ధం చేసుకున్నారనీ… ఫిబ్రవరి నెలలో జనసేనలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని కూడా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ అంటూ తొందరపడే కంటే, మొదటి ప్రయత్నంగా బలమైన నియోజక వర్గాల్లో బలంగా పోరాడితే చాలనే అంచనాలో జనసేనాని ఉన్నట్టు వినిపిస్తోంది.