రాజమండ్రిలో జరిగిన జయహో బీసీ బహిరంగ సభకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మీద పంచ్ లు వేశారు. వైకాపా ఒక అద్భుతమైన డ్రామా కంపెనీగా మారిందన్నారు. ఇంతవరకూ నాలుగు డ్రామాలు వేశారన్నారు. మొదటిది రాజీనామా డ్రామా అనీ, కేంద్రంలోని భాజపా నాయకులతో రాజీపడతారనీ, ఆంధ్రా ప్రజలకు నామం పెట్టడానికి ప్రయత్నించారన్నారు. ఆ హోదా పోరాట డ్రామా ఫ్లాప్ అయిందన్నారు. రెండో డ్రామా… కోడి కత్తి డ్రామా అన్నారు. స్క్రిప్టు ఢిల్లీలో రాస్తే, యాక్షన్ విశాఖ ఎయిర్ పోర్టులో జరుగుతుందనీ, ఆయన్ని గుచ్చిందేమో వైకాపా కార్యకర్తే అని చెప్పారు.
దాదాపు ఆరుగంటలు ఈ దొంగబ్బాయి నమస్కారాలు పెడుతూ హాయిగానే ఉన్నారనీ, ఏడో గంట ఆయన హాస్పటల్లో పడిపోయారని వ్యంగ్యంగా అన్నారు. ఆయనకి మన పోలీసుల రక్షణ కావాలిగానీ, దర్యాప్తు చేస్తే వద్దంటారన్నారు. ఎన్.ఐ.ఎ. వస్తే ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టొచ్చని అనుకుంటే… అదీ ఫ్లాప్ అయిందన్నారు. కేంద్రంతో లాలూచీ పడ్డా కూడా ప్రయోజనం లేకపోయిందాయనికి అంటూ విమర్శించారు.
మూడో డ్రామా… ఆవు – అంబులెన్స్ డ్రామా అన్నారు లోకేష్. ఒక సభలో ఆయన మాట్లాడుతూ… 108 నొక్కితే అంబులెన్స్ రాలేదని విమర్శించారని గుర్తుచేశారు. అప్పుడే కుయ్ కుయ్ అంటూ అంబులెన్స్ రాగానే జగన్ కి కాలినట్టుందనీ, చంద్రబాబు నాయుడు నిన్ను పంపించారా అంటూ డ్రైవర్ ని అడిగారన్నారు. తరువాత, రికార్డులు చూస్తే… ఆ సభకి వస్తూ ప్రమాదానికి గురైన వైకాపా కార్యకర్త కోసం వచ్చిందన్నారు. ‘ఆ తరువాత, ఒక బహిరంగ సభలో ఆవొచ్చిందండి. ఆవును చూసి… ఇది తెలుగుదేశం పార్టీ ఆవు, చంద్రబాబు నాయుడు పంపించారీ ఆవుని అంటారండి’ అని వ్యంగ్యంగా అన్నారు. ఆయనకి ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడే కనిపిస్తున్నారన్నారు. దేన్ని చూసినా టీడీపీ కనిపిస్తోందన్నారు.
నాలుగోది ఫెడరల్ ఫ్రెంట్ డ్రామా అన్నారు. ఆ కూటమిలో రెండే రెండు పార్టీలున్నాయన్నారు. అది ఆంధ్రుల ద్రోహుల ఫ్రెంట్ అన్నారు. ఆంధ్రులను విమర్శిస్తున్న వారితో చేతులు కలుపుతారా, జగన్ అంటే జగన్ మోహన్ రెడ్డి కాదు… జగన్ మోడీ రెడ్డి అంటూ నారా లోకేష్ విమర్శలు చేశారు. ఆంధ్రా ప్రజలంటే జగన్ కి చిన్నచూపు అన్నారు.