ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్య జోరు పెంచారు. వరుసగా అభివృద్ధి పథకాలు ప్రకటిస్తున్నారు. పెండింగ్ లో ఉన్న కార్యక్రమాలను చకచకా చేసేస్తున్నారు. ఆర్థికంగా ప్రభుత్వానికి కొంత ఇబ్బంది అవుతుందని తెలిసినా కూడా… కొన్ని నిర్ణయాలను తీసుకోవడంలో వెనకడాటం లేదు. ఫలితంగా ప్రతిపక్ష పార్టీ వైకాపాకి విమర్శించే అవకాశం లేకుండాపోతోంది. ఎన్నికల ప్రచారంలో ఏం చెయ్యాలో వారికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో, ఆ పార్టీ పత్రిక సాక్షి ఇప్పుడు రాష్ట్రానికి ఉన్న అప్పుల మీద పడింది! నేటి పత్రికలో ‘తలలన్నీ తాకట్టే’ అంటూ ఓ కథనం రాశారు. ఇప్పుడే పుట్టిన బిడ్డతో సహా ప్రతీ ఒక్కరి తల మీదా రూ. 75 వేలు అప్పు ఉందని రాసుకొచ్చారు.
రాష్ట్ర బడ్జెట్ పరిధి దాటేసి అప్పులకు వెళ్తున్నారనీ, పరిధిని మించి ఇప్పటి రూ. 95 వేల కోట్లు అప్పుటు చేశారనీ, ఇంకా రూ. 30 వేల కోట్ల కోసం ప్రపంచ బ్యాంకు చుట్టూ పరుగులు తీస్తున్నారని సాక్షి ఆందోళన చెందుతోంది! రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పులు రూ. 3.85 లక్షల కోట్లని చెప్పారు. అనుభవం ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల తలలపై అప్పుల గుదిబండ పెట్టారంటూ వాపోయారు. ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము తీసుకొచ్చి పని కొచ్చే పనులేవీ చేయలేదని రాశారు.
కరెక్టే… రాష్ట్రం అప్పుల్లోనే ఉంది. ఎందుకంటే, విభజన తరువాత అప్పుల ఊబితోనే నవ్యాంధ్ర ప్రయాణం మొదలైంది. ఆదుకోవాల్సిన కేంద్రం సాయం చేసిందా..? నిధులు సక్రమంగా ఇచ్చిందా..? జాతీయ ప్రాజెక్టు అని చెప్పుకునే పోలవరం పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టింది. ఆ బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదు. వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను కేంద్రం వెనక్కి తీసుకుంది. రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీ మీద ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన కేంద్రం చెయ్యదు. ఇవేవీ సాక్షికి కనిపించవు. కేంద్రం నుంచి సాయం అంది ఉంటే… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరోలా ఉండేది కదా. కేంద్రం ఇవ్వట్లేదని పనులు ఆపుకుని కూర్చుంటే… ఇదే సాక్షి పత్రిక ఇంకోలా రాసేది కదా!
ఇంకోటి… అప్పుల గురించి వైకాపా అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇప్పుడు ఏపీలో మొదలైన అభివృద్ధి కార్యక్రమాలు… రాబోయే పదేళ్లలో మంచి ఫలితాలను ఇస్తాయి. అప్పులు నెమ్మదిగా తీరుతాయి. మిగులు రాష్ట్రమైన తెలంగాణ కూడా తీవ్రంగా అప్పుల్లో కూరుకుపోయిందే. రాబోయే రోజుల్లో జరిగే అభివృద్ధితో ఆ అప్పుల్ని ఎలా తీర్చాలో మాకు తెలుసు అని సీఎం కేసీఆర్ చాలాసార్లు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలు ఆగకూడదంటే.. అప్పులు చేయక తప్పదు. అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు సకాలంలో పూర్తయితే, తరువాత ఫలితాలు రావడం మొదలౌతుంది. అయినా… ఆంధ్రాలో తమదే అధికారం అని చెప్పుకునే వైకాపా, అప్పులను చూసి ఆందోళన చెందితే ఎలా..? అధికారంలో ఉండేవారికి, లేదా రావాలనుకునేవారికి ఆందోళన ఉంటే ఎలా..? అభివృద్ధి మీద స్ఫష్టత ఉండాలి. ఇంత ఆందోళన చెందుతున్న వైకాపాకి అది ఉందో లేదో తెలుస్తూనే ఉంది. సమస్యల్ని అవకాశంగా మార్చుకునే ఆశావహ ద్రుక్పథం లేని నాయకత్వం ఆంధ్రాకి అవసరమో లేదో ప్రజలే నిర్ణయిస్తారు.