దగ్గుబాటి వెంకటేశ్వర్రావు వైకాపాలో చేరుతున్న సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు హితేష్ రామ్ రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన పార్టీ మారుతున్నారు. అయితే, ఇదే అంశమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సందర్భంగా దగ్గుబాటి అంశం ప్రస్థావనకు వచ్చింది. కుట్ర రాజకీయాలకు సంబంధించి కొంతమంది నేతలు మాట్లాడుతున్న సందర్బంలో దగ్గుబాటి గురించి మాట్లాడారు.
వారు ఇప్పటికే చాలా పార్టీలు మారారు, ఇప్పుడు మరొక పార్టీ మారారనీ దీన్లో కొత్తగా చర్చించుకోవాల్సిన అంశం ఏముందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆర్.ఎస్.ఎస్.తోపాటు అన్ని పార్టీల చుట్టూ దగ్గుబాటి చక్కర్లు కొట్టారని చెప్పారు. కాంగ్రెస్ లో ఉండగా పురందేశ్వరి మంత్రి అయ్యారనీ, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారనీ, ఆ తరువాత భాజపాలోకి వెళ్లారన్నారు. ఇప్పుడు అధికారం కోసమే వైకాపా వైపు వెళ్తున్నారన్నారు. లక్ష్మీ పార్వతి కూడా అదే పార్టీలో ఉన్నారనీ, వీళ్లంతా కుమ్మక్కు అవుతున్నారు అని ఆరోపించారు. రాజకీయంగా ఈ అంశానికి ఏమంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఈ అంశాన్ని పెద్దగా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే, దగ్గుబాటి కుటుంబం పార్టీలు మారుతుందనేది ఒక రొటీన్ అంశం అయిపోయింది. పైగా, వారు వెళ్తున్నది టీడీపీ నుంచి కాదు. హితేష్ రామ్ పార్టీ మారతాడని ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చే జరిగింది. వేరే పార్టీల్లో చేరి, అక్కడ ఎన్టీఆర్ ఇమేజ్ ను వాడుకునే పరిస్థితి వీరికి ఉండదనేది కూడా కొంతమంది అభిప్రాయం. వైకాపాలో చేరి, తాము ఎన్టీఆర్ వారసులమని చెప్పుకున్నా కూడా… రాజకీయంగా టీడీపీకి జరిగే నష్టమంటూ ఏదీ లేదు. అందుకే, ఈ అంశానికి టీడీపీ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అయితే, దగ్గుబాటి చేరిక ద్వారా వైకాపా వర్గాల ఆశాభావం ఏంటంటే… ఆ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత తప్ప, ఇతరులకు ఉండదనే ముద్ర ఉంది. దాన్నుంచి బయటపడేందుకు దగ్గుబాటి కుటుంబం చేరికను పెద్ద రాజకీయ మార్పుగా చూపించే ప్రయత్నం చేస్తోంది.