కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక పెద్ద హామీలనే ప్రజలకు ఇచ్చారని చెప్పొచ్చు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే… కనీస ఆదాయ పథకం అమల్లోకి తెస్తామన్నారు. ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఆ తరువాత, ఇదే అంశాన్ని ట్విట్టర్ లో ప్రస్థావించారు. లక్షల సంఖ్యలో సోదర సోదరీమణులు పేదరికంలో ఉంటే నవ్య భారతాన్ని నిర్మించలేమనీ, అందుకే వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రతీ పేదవాడికీ కనీస ఆదాయ హామీ ఇచ్చేందుకు పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు.
ఈ హామీ ఇప్పటికిప్పుడు ఇస్తున్నది కాదనీ, దేశంలోని పేదరికంపై గత రెండేళ్లుగా బాగా అధ్యయనం చేశామన్నారు. విదేశాల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాలపై కూడా అధ్యయనం చేశామనీ, ఆ తరువాతే ఈ పథకం తయారు చేశామన్నారు. దీని అమలుకు నిధులు సరిపోతాయనీ, దేశంలో పెద్ద మొత్తంలో బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టినవారి నుంచి డబ్బు వసూలు చేసి, నల్లధనాన్ని వెలికి తీసి ఈ పథకం అమలుకు ఖర్చు చేస్తామనీ రాహుల్ అన్నారు. అనిల్ అంబానీ లాంటి వారికి మోడీ ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చారో, తాము పేదలకు ఆ తరహా ప్రయోజనాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.
కనీస ఆదాయ హామీ అనేది ఏ రూపంలో ఇస్తారు అనేది స్పష్టంగా చెప్పలేదుగానీ, రాబోయే ఎన్నికల్లో ఇదో పెద్ద హామీ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నినాదంతోనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామంటూ చిదంబరం లాంటి నాయకులు అంటున్నారు. అయితే, ఈ పథకాన్ని ముందుగానే మూడు రాష్ట్రాల్లో అమలు చేసి చూపిస్తామని కూడా చెబుతున్నారు. గతంలో, ఇందిరా గాంధీ కూడా గరీబా హటావో అంటూ ఒక నినాదాన్ని అప్పట్లో తీసుకొచ్చారు. 1971 ఎన్నికల్లో ఇదే నినాదంతో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లి, ఘన విజయం సాధించారు. అదే బాటలో ఆమె మనవడు రాహుల్ గాంధీ ఇప్పుడు పేదలకు కనీస ఆదాయ పథకం అంటున్నారు. మరి, గరీబీ హటావో స్థాయి ఆదరణ ఈ పథకానికి వస్తుందో లేదో చూడాలి. కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల్లో ముందుగా అమలు చేసి చూపించగలిగితే… ఆ ఆదాయ గ్యారంటీ ఏంటనే స్పష్టత ప్రజలకు ఇవ్వగలిగితే… లోక్ సభ ఎన్నికల్లో ఈ హామీకి మంచి ఆదరణే లభించొచ్చు.