“అడిగిన సీట్లివ్వకపోతే ములాఖత్‌లు ఉంటాయి..” ఇది 2014కి ముందు కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి నుంచి.. నేరుగా.. టీడీపీ అధినేత చంద్రబాబుకు వచ్చిన హెచ్చరిక. అప్పట్లో ఈ వ్యవహారం కలకలం రేపింది. ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో జైలు నుంచే రాజకీయాలు నిర్వహించేవారు. ఎవరైనా.. జగన్ పార్టీలో చేరాలంటే… జైలుకు వెళ్లి ములాఖత్ నిర్వహించి బయటకు వచ్చి.. పార్టీలో చేరిపోతూంటారు. ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చిన వారు ఎంత మందో.. టీడీపీ నుంచి వెళ్లిన వారు కూడా అంతే మంది ఉన్నారు. వారిలో దాడి వీరభద్రరావు లాంటి సీనియర్లు కూడా ఉన్నారు. అలాంటి సమయంలో … తన డిమాండ్లు నెరవేర్చుకోవడానికి.. కేఈ కృష్ణమూర్తి చంద్రబాబును అలా బ్లాక్మెయిల్ చేశారన్నమాట. అయితే.. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు చంద్రబాబుతో కోట్ల భేటీ అయ్యారు. కేఈ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.
కర్నూలు జిల్లాలో కేఈ, కోట్ల కుటుంబాల మద్య రాజకీయ వైరం దశాబ్దాల నాటిది. కేఈ మాదన్న హయాం నుంచి ఈ వైరం సాగుతోంది. రాజకీయంగా.. ప్రత్యర్థులుగా తలపడే రెండు వేర్వేరు పార్టీల్లో ఉండటం వల్ల.. వీరి వైరం నిరంతరం సాగుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పనైపోయిన తర్వాత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి.. ఆయన వర్గం స్తబ్ధుగా ఉండిపోయింది. కేఈ వర్గంతో ఉన్న విబేధాల కారణంగా వారెవరూ.. టీడీపీకి సపోర్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి… సహజంగానే వైసీపీ వైపు మొగ్గారు. కానీ.. ఇప్పుడు టీడీపీలో చేరిపోతున్నారు. కేఈ వయోభారంతో.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యే పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లో పత్తికొండ టిక్కెట్న తన కుమారుడు శ్యాంబాబుకు ఖరారు చేయించుకున్నారు. ఓ సోదరుడికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారు. ఇప్పుడు రాజకీయంగా బద్దశత్రువు కోట్ల వర్గాన్ని పార్టీలోకి తీసుకున్నా… పెద్దగా వ్యతిరేకించలేని పరిస్థితి ఏర్పడింది. పార్టీ నుంచి వెళ్తానని.. ములాఖత్‌లు ఉంటాయని … హెచ్చరించలేని పరిస్థితి ఉంది.
ముఖ్యమంత్రితో భేటీలో సూర్యప్రకాష్ రెడ్డి.. ఫిబ్రవరి ఆరో తేదీన అనుచరులందరితో కలిసి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కర్నూలు ఎంపీ, డోన్ అసెంబ్లీ స్థానాలను చంద్రబాబు వారికి కేటాయించే అవకాశం ఉంది. సూర్యప్రకాష్ రెడ్డికి ఎంపీ, ఆయన సతీమణి సుజాతమ్మకు ఎమ్మెల్యే సీటు కేటాయిస్తారని చెబుతున్నారు. అవి వారి సిట్టింగ్ సీట్లే. తర్వాత కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది. డోన్‌లో.. కేఈ సోదరుడు టిక్కెట్ రేసులో ఉన్నారు. ఎంపీ స్థానానికి బుట్టారేణుక పేరును.. గతంలో లోకేష్ ప్రకటించారు. కానీ ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పి బుజ్జగించే అవకాశం ఉంది. కేఈ, కోట్ల వర్గాలు ఒకే పార్టీలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.