ఆదినారాయణరెడ్డి – రామసుబ్బారెడ్డిలను… ఒకే వేదికపై చూస్తారని కూడా … జమ్మల మడుగు రాజకీయాలపై అవగాహన ఉన్న వారు ఎవరూ అనుకోరు. కానీ వారిద్దరు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇద్దరితో చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
జేసీ దివాకర్ రెడ్డి – పరిటాల సునీతలు ఒకే పార్టీలో ఉంటారని.. గత ఎన్నికల ముందు ఎవరైనా ఊహించారా..?. జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి – రామసుబ్బారెడ్డిల మధ్య ఎంత వైరం ఉందో.. అనంతపురం జిల్లాలో జేసీ – పరిటాల వర్గాల మధ్య అంత కంటే ఎక్కువ వైరం ఉంది. వీరిద్దరూ ఒకే పార్టీలో ఉంటారని.. ఎవరూ ఊహించలేదు. కానీ అది నిజమయింది. గత ఐదేళ్లుగా… ఆ రెండు వర్గాలు కలిసే.. అనంతపురంలో రాజకీయాలు చేస్తున్నాయి.
ఇప్పుడు కోట్ల – కేఈ … కూడా.. కలసి రాజకీయాలు చేయబోతున్నారు. కర్నూలు జిల్లాలో దశాబ్దాలుగా రాజకీయ వైరంతో పోట్లాడుకున్న కోట్ల – కేఈ కుటుంబాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కలసి నడవడానికి సిద్ధమయ్యాయి. ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి – కరణం వర్గాల మధ్య ఫ్యాక్షన్ చిచ్చు కూడా ఉంది. ఇప్పుడు వారు కూడా ఒకే పార్టీలో కొనసాగుతున్నారు.
సాధారణంగా జిల్లాను లేదా.. .నియోజకవర్గాన్ని శాసించగలిగే స్థితిలో ఉండే ఇద్దరు నేతలు వేర్వేరు పార్టీల్లో ఉంటారు. ఒకే పార్టీలో ఉండటం అసాధ్యం కానీ.. టీడీపీ అధినేత మాత్రం.. తన మార్క్ రాజకీయంతో అందర్నీ పార్టీలో ఉంచగలుగుతున్నారు. సాధారణంగా ఫ్యాక్షన్ నేపధ్యం ఉన్న వారు కలవడానికి అసలు ఆసక్తి చూపించరు. కానీ చంద్రబాబు.. ఫ్యాక్షన్కు కాలం చెల్లేలా.. వారందర్నీ.. ఒకే తాటిపైకి తీసుకు రాగలుగుతున్నారు. నిజానికి… రాజకీయ పార్టీల లక్షణం.. కలపడం కాదు.. విడగొట్టడం. ఇలా.. బలమైన నేతల మధ్య వీలయినంత దూరం పెంచి.. దాన్ని తమ పార్టీకి అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. గతంలో వైఎస్ సీమలో ఇలానే చేశారని.. అందువల్లే అప్పట్లో బలమైన వర్గాలకు … నిలవడం వల్ల.. పట్టు సాధించారని చెబుతూ ఉంటారు. అయితే చంద్రబాబు మాత్రం.. దానికి భిన్నమైన పద్దతిని పాటిస్తున్నారు. గొడవల్లేకుండా.. అందర్నీ ఒకే పార్టీలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే.. అధికార పార్టీ కాబట్టి.. ఇలా… చంద్రబాబు.. ఒకే ఒరలో.. రెండు కత్తుల్ని.. పెట్టినప్పటికీ… ఎంత వరకు సర్దుకుపోతారనేది కీలకం. ఇద్దరు బలమైన నాయకులు.. అయనప్పుడు.. తమ ప్రభావం తాము చూపించాలనుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరో ఒకరికి ప్రాధాన్యం ఇచ్చి.. మరొకరి విషయంలో.. ఆలోచించాల్సి ఉంటుంది. ఎంత వరకూ.. ప్రాధాన్యం తగ్గించే నేతలకు సర్ది చెబుతారన్నదానిపై.. అసలు విషయం ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకూ.. అది సజావుగానే సాగింది. ఎన్నికల సమయంలో మాత్రం చిక్కులు తప్పవు. ఈ విషయంలో చంద్రబాబుకు ఓ అడ్వాంటేజ్ ఉంది. అదే జగన్ మార్క్ రాజకీయం. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా అందర్నీ కలుపుకుని వెళ్లే పరిస్థితి లేదు. అందుకే.. వారు జగన్మోహన్ రెడ్డిని నమ్మడానికి వారు సిద్ధపడటం లేదు. అందుకే.. ఆయన పార్టీలోకి వెళ్లడం లేదు. టీడీపీలోనే సర్దుకుంటున్నారు. అయితే.. ఎన్నికల ముందు మాత్రం.. అసలు వర్గ పోరు ప్రారంభమవుతుంది. టిక్కెట్ల సర్దుబాటులో అందర్నీ సంతృప్తి పరిచగలిగితే.. చంద్రబాబు చాణక్యం సూపర్ అని అనుకోకుండా ఉండలేం.