ఒకప్పుడు..అంటే 2014ఎన్నికలకు ముందు లోక్ సత్తా పార్టీ నేత జయప్రకాష్ నారాయణ్ తెదేపా, బీజేపీలతో పొత్తులు పెట్టుకొని వాటితో కలిసి పోటీ చేయాలనుకొన్నారు. వారు అంగీకరిస్తే ఆయన సికింద్రాబాద్ లోని మల్కాజ్ గిరి నుండి లోక్ సభకు పోటీ చేద్దామనుకొన్నారు. కానీ ఆ రెండు పార్టీలకే ఉన్న సీట్లు సరిపోవు కనుక వారు ఆయనని పట్టించుకోలేదు. కనుక ఆయన తమ పార్టీ తరపునే పోటీ చేసారు కానీ ఓడిపోయారు.
ఈసారి లోక్ సత్తా పార్టీ పక్షాలతో జత కట్టి గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేస్తోంది. వాటి తరపున ప్రచారం చేస్తున్న జయప్రకాష్ నారాయణ్ ఇప్పుడు తెదేపాని విమర్శిస్తున్నారు. తెదేపా, తెరాసల మధ్య రహస్య అవగాహన ఉందని, కనుక తెదేపాకు ఓటు వేస్తే తెరాసకు ఓటు వేసినట్లేనని ఆయన అన్నారు. జయప్రకాష్ కూడా ప్రధానంగా ఆంద్ర ఓటర్లపైనే చాలా ఆశలు పెట్టుకొన్నారు కనుక వారిని ఆకర్షించడానికి ఆవిధంగా అని ఉండవచ్చును.
అమరావతి శంఖుస్థాపన తరువాత ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య కొత్తగా స్నేహం చిగురించినట్లు పైకి కనబడుతున్నప్పటికీ అది కేవలం “కండిషనల్ స్నేహమనే” సంగతి అందరికీ తెలుసు. వారిరువురూ అప్పుడప్పుడు కలిసి షేక్-హ్యాండ్స్ ఇచ్చుకొంటున్నప్పటికీ, చంద్రబాబు నాయుడుపై కేసీఆర్ మరియు ఆయన పార్టీ నేతలకి ఎంతటి చులకన భావం ఉందో ఈ ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా కనబడుతోంది.
ఓటుకి నోటు కేసుతో తెలంగాణాలో తెదేపా పునాదులు కదిలిపోయాయి. అది జరిగిన తరువాత చంద్రబాబు నాయుడు విజయవాడ తరలివెళ్లిపోవలసి వచ్చింది. అప్పటి నుండే తెరాస ఒక పద్ధతి ప్రకారం తెలంగాణాలో తెదేపాను తుడిచిపెట్టేయడం మొదలుపెట్టింది. ఆ కారణంగా తెదేపా నేతలు, వారి అధినేత చంద్రబాబు నాయుడు కూడా తెరాసను అంతరంగంలో శత్రువుగానే భావిస్తుండటం చాలా సహజం. కనుక ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య స్నేహం అనేది కేవలం నటన మాత్రమేనని చెప్పవచ్చును. కనుక వారి మధ్య రహస్య అవగాహన కుదరటం అసాధ్యం.
కానీ, తెరాస చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష ద్వారా తెదేపా తరపున ఎన్నికలలో నెగ్గుతున్నవారిని తెరాసలోకి తీసుకుపోతోంది. ప్రతిపక్ష పార్టీలు ఎంతో శ్రమపడి తమ అభ్యర్ధులను గెలిపించుకొంటుంటే, తెరాస ఏమాత్రం కష్టపడకుండా వారిని తెరాస ఎత్తుకుపోతోంది. అంటే కష్టం ప్రతిపక్షాలది కానీ దాని ఫలాలు దక్కేది తెరాసకి అన్న మాట. కనుక ఆవిధంగా జయప్రకాశ్ నారాయణ చెప్పిన మాట నిజమయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చును.