రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధుల గురించి… మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి రాష్ట్రానికో రకంగా మాట్లాడుతున్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. మన రాష్ట్రమే తీసుకుంటే… విభజన తరువాత చాలా అభివృద్ధి చేసేశామనీ, స్వతంత్రం వచ్చిన తరువాత ఏ రాష్ట్రానికీ ఏ కేంద్ర ప్రభుత్వమూ చెయ్యనంత చేసేశామని చెబుతున్నారు. వచ్చేనెల 4న బస్సు యాత్ర ప్రారంభానికి రాబోతున్న అమిత్ షా… ఆంధ్రాలో మోడీ సర్కారు అభివృద్ధి ప్రచారాన్ని ప్రారంభిస్తారట. కానీ, అదేంటో… ఈరోజు ఒడిశా వెళ్లి, ఆ రాష్ట్ర అభివృద్ధి గురించి కటక్ జిల్లాలో జరిగిన ఓ సభలో ఇంకోలా మాట్లాడారు అమిత్ షా!
ఒడిశాకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిందనీ, కానీ రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదనీ, ఎక్కడ చూసినా వెనకబాటుతనమే ఉందంటూ అమిత్ షా విమర్శించారు. ఒడిశా వెనకబాటుకి కారణం నవీన్ పట్నాయక్ ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. ఆయన అసమర్థంగా వ్యవహరించి, పాలనపై నిర్లప్తతతో ఉన్నారనీ, అందుకే మోడీ సర్కారు ఎన్ని నిధులు ఇస్తున్నా ఇక్కడి ప్రజల జీవితాల్లో మార్పు రావడం లేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలతో సహా పేద ప్రజలందరి అభివృద్ధి కోసం మోడీ పనిచేస్తున్నారన్నారు. దేశంలో మరోసారి మోడీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో మహా కూటమి సాధ్యం కాదనీ, నాయకులకూ విధానాలకు మధ్య పొంతనలేని కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయగలదని విమర్శించారు.
ఆంధ్రాని చాలా అభివృద్ధి చేశామంటారు, కానీ అదేంటో చెప్పమంటే ఇక్కడ చెప్పలేరు. ఒడిశాకు వచ్చేసరికి చాలా నిధులు ఇచ్చినా అభివృద్ధి కాలేదంటారు. ఇంతకీ, అమిత్ షా ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయనకే స్పష్టత లేనట్టుంది. మరి, ఆంధ్రాలో చేసిన మాదిరిగానే… ఒడిశాని కూడా ఎందుకు అభివృద్ధి చెయ్యలేకపోయారట..? అమిత్ షా కన్ఫ్యూజన్ లోనే అసలు విషయం బయటపడుతోంది. రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం ఏ స్థాయిలో అణచి వేసిందో, రాజకీయంగా వారికి ఉపయోగం లేదు అనుకునే రాష్ట్రాల పట్ల పక్షపాత బుద్ధితో ఎలా వ్యవహరిస్తున్నారో వారే చెప్పకనే చెబుతున్నారు. అభివృద్ధి గురించి ఆంధ్రాకి వచ్చేసరికి ఒకలా, ఒడిశాకు వెళ్లి మరోలా మాట్లాడుతున్నారు. ఆంధ్రాలో టీడీపీ సర్కారు చేసిన అభివృద్ధిలో భాజపా క్రెడిట్ వెతుక్కుంటోంది. ఒడిశాలో అలాంటి వాతావరణం ఏదీ కనిపించకపోయేసరికి… రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి అమిత్ షా మాట్లాడుతున్నారు.