విభజన సమస్యలపై అఖిలపక్షం పెట్టాలని.. బృందాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని రాజకీయ పార్టీలు ప్రజల ముందు.. ప్రసంగాలు ఇచ్చేస్తూ ఉంటాయి. కానీ ప్రభుత్వం నిజంగా అఖిలపక్షం పెడితే మాత్రం… హాజరు కావు. గతంలో రెండు సార్లు అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడు మెజార్టీ పార్టీలు దూరంగా ఉన్నాయి. ఇక ఎన్నికలకు ముందు చివరి పోరాటంగా.. అందరూ కోరుతున్నారని.. ప్రభుత్వం మరో అఖిలపక్షం ఏర్పాటు చేసింది. అందరికీ ఆహ్వానాలు పంపింది. కానీ ప్రజల ముందు.. మీడియా ముందు తాము చెబుతున్న అఖిలపక్షం ఏర్పాటు చేసినా.. వారు.. మాత్రం.. ఆహ్వానం సంప్రదాయంగా అందలేదనే కారణం దగ్గర్నుంచి.. ఇంత హడావుడిగా పెడితే ఎలా అనే కారణం వరకూ.. ఎన్ని రకాల సాకులు ఉంటే.. అన్ని రకాల సాకులు చెప్పుకుని.. డుమ్మా కొట్టాలని నిర్ణయించుకున్నారు.
ఏపీ ప్రభుత్వం మూడవ సారి బుధవారం అఖిలపక్షం ఏర్పాటు చేస్తుంది. లోక్ సభ బడ్జెట్ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ కోసం ఒత్తిడి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి అన్ని పార్టీలను, ప్రజా సంఘాలను ఆహ్వానించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహిస్తారు. కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 1వ తేది నుంచి ప్రారంభమవుతున్న తరుణంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోరాట పంధాను ఎంచుకుంది. అందుకే అఖిలపక్షం ఏర్పాటు చేసింది. కేంద్రం పై ఒత్తిడి పెంచుతూ 13వ తేది వరకు కూటా ఎటువంటి హామీ ఇవ్వని పక్షంలో 13వ తేదిన ఢిల్లీలో దీక్షకు కూర్చోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. 1వ తేదిన ఢిల్లీలో బిజెపీయేతర పక్షాల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించనున్నారు. 13వ తేది నాటి దీక్షకు అందరూ మద్దతు పలకాలని, ఈ లోపు కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలని చంద్రబాబు అఖిల పక్ష సమావేశంలో కోరనున్నారు.
అయితే ఈ సమావేశానికి వైసీపీనే కాదు.. కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన కూడా.. దూరంగా ఉంటామని ప్రకటించాయి. వచ్చిన వారందరికీ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, రావాల్సిన నిధులు, కేంద్రం పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రూపొందించాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు. అయితే.. ఎలాంటి పోరాట ప్రణాళిక లేని..ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిసి కూడా.. ఉండవల్లి.. సమావేశం ఏర్పాటు చేస్తే.. వెళ్లిన పార్టీలు .. ప్రభుత్వం నేరుగా కేంద్రంపై పోరాటానికి ప్రణాళిక వేస్తే కలిసి రాకపోవడం.. అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.