మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ హఠాత్తుగా.. అఖిలపక్షం, మేధావుల సమావేశం ఏర్పాటు చేశారు. అజెండా ప్రకారం… ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, హామీలపై చర్చ జరపాల్సింది. కానీ… మూడు, నాలుగు గంటల్లోనే సమావేశం ముగిసింది. ఎలాంటి తీర్మానాలు లేవు. మళ్లీ సమావేశమవ్వాలన్న ఆసక్తి కూడా ఎవరికీ కనిపించలేదు. దానికి కారణం ఉండవల్లి వ్యవహారశైలినే. ఆయన విభజనపై చర్చించాలని పట్టుబట్టారు. అసలు విభజనకే చట్టబద్దత లేదని సమావేశంలో ఉండవల్లి వాదించారు. విభజన చట్టం అమలు పై చర్చ జరగాలని ఉండవల్లి ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ పార్టీని విలన్‌ను చేయడానికే.. సమావేశం పెట్టారని… కాంగ్రెస్ పార్టీ నేతల తులసీరెడ్డి ఆరోపించి బయటకు వెళ్లిపోయారు. రాష్ట్ర విభజన జరగాలంటే మెజారిటీ సభ్యల మద్దతు ఉండాలని, కానీ అలా జరగలేదని ఉండవల్లి చెప్పుకొచ్చారు. అది ఆయన ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదనే. సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేశారు. ఇప్పుడు.. దానిపై అఖిలపక్షం పెట్టాల్సిన అవసరం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు.
ఉండవల్లి వాదన అర్థం చేసుకున్న పవన్ కల్యాణ్… ఆ విభజన పై మాట్లాడలేక.. ఇటు విభజన హామీలపై.. తన వాదన వినిపించలేక.. తంటాలు పడ్డారు. విభజన మూలంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోరాడకపోతే పౌరుషం లేని వాళ్ళుగా మిగిలిపోతామని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా చేశారన్న ఆయన కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై అన్ని పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రం కోసం మాజీ ఎంపీ ఉండవల్లి చేస్తున్న కృషి గొప్పదని, విభజన హామీలపై పోరాడుతున్న ఆయనపై అపార గౌరవం ఉందని పేర్కొన్నిరు. ఎప్పుడో జరిగిపోయిన విభజన గురించి ఉండవల్లి ఇప్పుడెందుకు లేవనెత్తుతున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారని… భవిష్యత్తు తరాల కోసం పార్టీలకతీతంగా అందరూ ఏకతాటిపైకి రావాలన్నారు.
ఈ సమావేశానికి బీజేపీ తరపున ఐవైఆర్ కృష్ణారావును కూడా ఆహ్వానించారు. ఆయన బీజేపీ వాదన చెప్పేందుకు అవకాశం కల్పించారు. ఆయన తనకు తోచిన లెక్కలు ఆయన చెప్పారు. అయితే… వాటికి ప్రాతిపదిక ఏమిటో చెప్పకపోవడంతో… ఇతరులు విబేధించారు. మొత్తం మీదఎలాంటి తీర్మానం లేకుండా, మరో సమావేశం ఎప్పుడో తేల్చకుండా సమావేశం అసంపూర్తిగా ముగియడం పట్ల అఖిల పక్ష నాయకులు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉండవల్లి ప్రత్యేకమైన ఎజెండాతో దీన్ని ఏర్పాటు చేశారన్న అభిప్రాయం వ్యక్తమయింది.