సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడేకొద్దీ.. దేశం మొత్తం ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి… కాబట్టి… ఆ వేడి డబుల్ అయింది. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో పీఠం గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ , బీజేపీలు ప్రజలను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి. రాహుల్ గాంధీ రూ. 2 లక్షల రుణమాఫీ, పేదలందరికి కనీయ ఆదాయ పథకాన్ని ప్రకటించారు. వీటిని మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. రాహుల్‌కు పోటీగా.. ఏదో ఒకటి చేయకపోతే.. తమకు గండం తప్పదని బీజేపీ భావిస్తోంది. అందుకే.. కొత్త కొత్త పథకాల ఆలోచనలు చేస్తోంది. నోట్ల రద్దు, జీఎస్టీలతో ప్రజలు పడిన బాధలు మర్చిపోయేలా .. పథకాలు పెట్టాలని డిసైడ్ అయింది. అన్నింటికీ ఒకే పథకంతో చెక్ పెట్టాలని మోడీ స్కెచ్ వేశారు. ఓ పథకానికి రూపకల్పన చేశారు. ఆ పథకం పేరు ” యూనివర్శల్ బేసిక్ ఇన్‌కం” స్కీమ్.
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. మామూలుగా అయితే.. మరో మూడు నెలల్లో ఎన్నికలు ఎదుర్కోవాల్సిన ప్రభుత్వం పూర్తి స్థాయి పద్దు ప్రవేశ పెట్టదు. కానీ… బీజేపీ మాత్రం.. ఈ సారి… తనకు అధికారం లేకపోయినా.. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలని ఆలోచన చేస్తోంది. ఇందులోనే ” యూనివర్శల్ బేసిక్ ఇన్‌కం” స్కీమ్ ను పెట్టి.. ప్రజలకు వల వేయాలని డిసైడయింది. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఎవరే పరిస్థితుల్లో ఉన్నా అందరికీ కనీస ఆదాయం ఉండాలని 2016-17 ఆర్థిక సర్వే తెలిపింది. అయితే, ఈ పథకాన్ని అమల్లోకి తెస్తే, ఆర్థిక సమానత్వం ఎలా సాధిస్తుందన్నది ప్రశ్న. ప్రస్తుతం ఆహారాధాన్యాలకు రూ.1.70లక్షల కోట్ల సబ్సిడీ , ఉపాధి హామీ పనులకు అదనంగా మరో రూ.55వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ పథకాలను నిలిపి వేసి..” యూనివర్శల్ బేసిక్ ఇన్‌కం” స్కీమ్‌కు మళ్లిస్తారు.
నిజానికి.. కాంగ్రెస్ హయాంలోనే.. 2011-12లో మధ్య ప్రదేశ్‌లోని 8 గ్రామాల్లో యూబీఐ పథకాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేశారు. ఆ తర్వాత నిలిపి వేశారు. ఇప్పుడు బడ్జెట్లో కేంద్రం పథకాన్ని ప్రకటిస్తే.. మళ్లీ పైలట్ ప్రాజెక్ట్‌గా కొన్ని చోట్ల ముందస్తుగా అమలు చేస్తుంది. మొత్తానికి… ఇప్పటి వరకూ అధికారంలో ఉన్నప్పటికీ.. ఇలాంటి పథకాలపై ఇప్పటి వరకూ.. ఎలాంటి ఆలోచన చేయని మోడీ.. ఇప్పుడు మాత్రం… పరుగులు పెడుతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా.. పేదల ఖాతాల్లో నగదు జమ కావడం ఖాయంగా కనిపిస్తోంది.