తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి చాలారోజులైపోయింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణం చేశారు. అయితే, తెలంగాణ మంత్రి మండలి ఏంటనేది ఇప్పటికీ తేల్చడం లేదు. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందీ అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇంకా చెప్పాలంటే… మంత్రి వర్గ విస్తరణపై తెరాస నేతల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతున్న పరిస్థితి. ఎవరికి పదవులు దక్కుతాయనే చర్చ కూడా ఇప్పుడు తెరాస వర్గాల్లో లేకుండా పోయింది. అయితే, ఫిబ్రవరి నెలలో బడ్జెట్ సమావేశాలుంటాయి. ఫిబ్రవరి మూడు, లేదా నాలుగు వారాల్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కనీసం అప్పటికైనా విస్తరణ ఉంటుందా లేదా అనే చర్చ ఇప్పుడు తెరాస వర్గాల్లో మొదలైంది.
తాజాగా వినిపిస్తున్న మాట ఏంటంటే… ఫిబ్రవరి పదిలోపు కొంతమంది కొత్త మంత్రులను కేసీఆర్ నియమిస్తారని! మొత్తంగా 18 మందితో కేబినెట్ కూర్పు ఉండే అవకాశం ఉంది. అయితే, తొలిదశగా ఓ పదిమందిని మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని తాజా కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేబినెట్ లో ముఖ్యమంత్రితో సహా ఇద్దరున్నట్టు లెక్క. మరో పదిమందిని కొత్తగా తీసుకుంటే 12 మంది అవుతారు. మిగిలిన ఆరుగురు మంత్రుల్నీ లోక్ సభ ఎన్నికల తరువాతే నియమించే అవకాశం ఉందంటున్నారు. కేసీఆర్ కి సెంటిమెంట్లు ఎక్కువ కాబట్టి, ఆయన అదృష్ట సంఖ్యలైన మూడు, ఆరు, తొమ్మిదిలను లెక్క చూసుకుని మంత్రులను తీసుకుంటారనే మరో వాదనా వినిపిస్తోంది.
అయితే, ఫిబ్రవరి 10 లోపైనా కొత్త మంత్రుల్ని తీసుకుంటారనే చర్చపై తెరాస వర్గాల్లో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆయన మనసులో ఏముందు ఎవ్వరికీ తెలియడం లేదనీ, బడ్జెట్ కి ఒకరోజు ముందు ఆయన కేబినెట్ విస్తరణ అని ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ కొంతమంది ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గం విస్తరణ చేయకుండా పాలన సాగిస్తుంటే, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనీ, రెండోసారి గెలిచాక తెరాసకు నిర్లక్ష్యం వెంటనే వచ్చేసిందనీ, పాలనపై అశ్రద్ధ అప్పుడే మొదలైపోయిందనే చర్చ ప్రారంభమౌతుందని కూడా అంటున్నారు. ప్రతిపక్షాలు బలంగా లేనంత మాత్రాన ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేక చర్చకు ఆస్కారం ఇచ్చేలా ఈ విస్తరణ వ్యవహారం తయారైందని వాపోతున్నవారూ ఉన్నారు.