దిల్ రాజు బ్యానర్లోనే కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. అదే.. `జోష్`. కాకపోతే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఏ హీరో కోరుకోని.. ఎంట్రీ నాగచైతన్యకు ఈ సినిమాతో దొరికింది. అప్పటి వరకూ హిట్లు మీద హిట్లు కొట్టిన దిల్‌రాజు సంస్థకు నాగచైతన్యకు హిట్ ఇవ్వలేకపోయామే… నాగ్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయామే.. అనే ఓ లోటు ఉండిపోయింది. దాన్ని తీర్చుకునే అవకాశం దక్కింది.
దిల్‌రాజు బ్యానర్లో నాగ చైతన్య మరో సినిమా చేయబోతున్నాడు. ఈసారి.. ఓ కొత్త దర్శకుడితో. ఇప్పటికే దిల్‌రాజు కథ విని, ఓకే చేసేశాడు. అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాతో శశి అనే ఓ కొత్త దర్శకుడ్ని పరిచయం చేయబోతున్నారు దిల్‌రాజు. గత పదేళ్లుగా దిల్‌రాజు సంస్థలో సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నాడు శశి. చైతూకి తగిన ఓ కథ తయారు చేసి, దిల్‌రాజుకి వినిపించాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.