గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా ఎవరు అభివృద్ధి చేసారో అందరికీ తెలుసు. దానిని అత్యాధునిక నగరంగా తీర్చి దిద్దింది నేనే. నేను సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీని కేవలం 15నెలల వ్యవధిలోనే నిర్మించాము. సుమారు 5000 ఎకరాలలో శంషాబాద్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించడానికి మేమే ప్రణాళికలు తయారుచేసాము. మెట్రో రైల్ ప్రాజెక్టు ఏర్పాటుకి కూడా అప్పుడే మేము ప్రయత్నాలు మొదలుపెట్టాము. పర్యాటక కేంద్రంగా ఉన్న హైదరాబాద్ ని వైద్య పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసాము. నగరంలో ఫ్లై ఓవర్లు వంటి ఆధునిక మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసాము. తత్ఫలితంగా హైదరాబాద్ నగరానికి ప్రపంచం నలుమూలల నుండి పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చేయి. ఆ కారణంగానే దేశం నలుమూలల నుండి ప్రజలు హైదరాబాద్ కి తరలిరావడం మొదలుపెట్టారు. అందుకే ఒకప్పుడు 30 లక్షల మంది జనాభా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు కోటికి చేరుకొంది. ఆనాడు మేము హైదరాబాద్ అభివృద్ధి కోసం చేపట్టిన అనేక చర్యలు ఫలితాలనే నేటి పాలకులు అనుభవిస్తున్నారని గుర్తుంచుకోవాలి,” అని అన్నారు.
“నా హయంలోనే హైదరాబాద్ నగరం చాలా వేగంగా అభివృద్ధి చెందిందని నాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు కానీ దానిని కొన్ని రాజకీయ పార్టీలు అంగీకరించేందుకు సిద్దంగా లేవు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా హైదరాబాద్ పై ఉన్న నాముద్ర అడుగడుగునా కనబడుతూనే ఉంటుంది. ఇది నా మానస పుత్రిక. కనుక దీనిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళిపోలేను. హైదరాబాద్ నగరానికి కేవలం అరగంటలో చేరుకొనే దూరంలో ఉన్నాను. ప్రజలకు ఎప్పుడు నా అవసరమున్నా వెంటనే వస్తాను. మా హయంలో జరిగిన అభివృద్దే మా నిబద్దతకి, పనితనానికి కొలమానంగా నిలుస్తుంది. కనుక ప్రజలు మాకే ఓటేసి గెలిపిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మా పార్టీ టికెట్ పై పోటీ చేసి గెలిచిన కొంతమంది నేతలు పదవులు, అధికారం కోసం మాకు ద్రోహం చేసి తెరాసలో చేరుతున్నారు. అటువంటి ద్రోహులు వెళ్ళిపోయినందుకు నేను బాధపడటం లేదు. కానీ మా పార్టీ విడిచి పెట్టి వేరే పార్టీలో చేరినా ఇంకా మా పార్టీ పెట్టిన భిక్ష-ఎమ్మెల్యే పదవులను వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. అటువంటి వారందరికీ ఈ ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి,” అని చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు.