ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకుని.. ప్రత్యేకహోదా పోరాటం చేయాలనుకుంటున్నారు. అందుకే సమావేశం పెట్టి ప్రత్యేకంగా కార్యాచరణ ప్రకటించారు. ఢిల్లీలో దీక్ష కూడా చేయబోతున్నాయి. అయితే.. ప్రధాన పార్టీలేవీ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేదు. అయినప్పటికీ.. కార్యాచరణ ప్రకటించారు. ఈ అఖిలపక్ష పోరాటాల వల్ల ప్రయోజనం ఎంత వరకు ఉంటుంది.
ఏపీ అఖిలపక్షానికి ప్రధాన పార్టీలు ఎందుకు దూరం..?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు… నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి.. కాంగ్రెస్, వైసీపీ, బీజేపీ, జనసేన హాజరు కాలేదు. గతంలోనూ… ఈ పార్టీలు అఖిలపక్ష భేటీకి హాజరు కాలేదు. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని నీరు గార్చిందని.. చంద్రబాబునాయుడేనని.. అందుకే.. తాము అఖిలపక్ష భేటీలకు హాజరు కాబోమని ఈ పార్టీలు చెబుతున్నాయి. అయితే.. అంతకు ముందు రోజు.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి… ఒక్క వైసీపీ, సీపీఎం మినహా అందరూ హాజరయ్యారు. ప్రత్యేకహోదా విషయంలో రాజకీయం చేసిన టీడీపీ, జనసేన సమావేశంలో ఉండగా.. తాము ఎందుకు వస్తామని… వైసీపీ గైర్హాజరుకు కారణంగా చెప్పుకుంది. ఈ పార్టీలన్నీ… టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే.. అఖిలపక్షం ఏర్పాటు చేసిందని ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగానే ప్రతిపక్షాలు నడవవు.
ఏపీలో హోదా కోసం పార్టీలన్నీ కలసి పోరాడలేవా..?
అఖిలపక్ష పోరాటానికి ఆంధ్రప్రదేశ్లో .. అవకాశమే లేదు. ఎందుకంటే ప్రత్యేకహోదాపై… రాజకీయ పార్టీలు.. భిన్నమైన సమయాల్లో.. భిన్నమైన వాదనలు వినిపించాయి. అంటే.. రాజకీయపార్టీలన్నీ.. ఒకే మాట మీద ఎప్పుడూ లేవు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. బీజేపీతో కలిసి ఉన్నంత కాలం ప్రత్యేకహోదా విషయంలో వ్యతిరేకంగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేకహోదా కండిషన్ పెట్టకుండానే బీజేపీకి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించి వచ్చారు. మిగతా పార్టీలు కూడా.. అలాంటి వైఖరితోనే ఉన్నాయి. టీవీ ఇంటర్యూల్లో ఒక రకంగా… బయట మరో రకంగా ఏపీ పార్టీల నేతలు మాట్లాడారు. అందువల్ల ప్రత్యేకంగా నిర్దిష్టంగా ప్రత్యేకహోదా నినాదం తీసుకున్నరాజకీయ పార్టీలు తక్కువ. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారు చూసుకుంటున్నారు. అఖిలపక్ష భేటీలకు హాజరు కాకపోవడానికి.. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి… ఆయా పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నాయని.. చంద్రబాబు కూడా.. అఖిలపక్ష సమావేశంలో వ్యాఖ్యానించారు.
పార్టీల వారీగా నేతలు విడిపోవడంతోనే సమస్య ..!
తెలుగుదేశం పార్టీ అధినేత అఖిలపక్ష సమావేశంలో జేఏసీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు ఏర్పాటు చేస్తే.. అది జేఏసీ ఎలా అవుతుంది..? టీడీపీ యాక్షన్ కమిటీ అవుతుంది. అందరూ కలిసి జేఏసీని ఏర్పాటు చేసుకోవాలి. జేఏసీ ఏర్పాటు చేసుకోవాలంటే… ఏకాభిప్రాయం ఉండాలి. ఇప్పుడు అది ఏపీ రాజకీయ పరిస్థితుల్లో కనిపించడం లేదు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఏర్పాటు విజయం సాధించింది. ఏపీలో ఎందుకు సాధ్యం కాదని.. కొంత మంది అంటున్నారు. అప్పట్లో.. జేఏసీ ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. తెలంగాణ వాదం.. తెలంగాణ నేతలందర్నీ ఏకతాటిపైకి తెచ్చింది. పైగా.. అప్పుడు కూడా.. తెలంగాణ జేఏసీ ఏర్పాటు పూర్తి స్థాయిలో ఏర్పడలేదు. కాంగ్రెస్, టీడీపీలను పంపించేశారు. సీపీఎం చేరలేదు. అయినప్పటికీ.. టీఆర్ఎస్ కనుసన్నల్లోనే జేఏసీ నడిచింది. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ నేతృత్వం కావడంతో ఎవరూ నోరు మెదపలేకపోయారు. ఏపీలో అలా కాదు.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేకహోదా ఉద్యమం జరగడం లేదు.. అలాగే.. హోదా కోసమే ప్రత్యేకంగా పుట్టిన పార్టీలుపోరాడటం లేదు. తెలంగాణలో ప్రాంతాల వారీగా నేతలు విడిపోయారు. ఏపీలో పార్టీల వారీగా విడిపోయారు. కాబట్టి.. ఐక్యమైన ఏపీ ప్రయోజనాల కోసం నిలబడటం అంత ఈజీ కాదు. రాజకీయ ప్రయోజనాలు.. ఇమిడి ఉన్నాయి. ప్రభుత్వానికి పేరు రావాలని టీడీపీ… ప్రభుత్వంపైనే నింద వేయాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి…కాబట్టి.. అఖిలపక్షపోరాటాలు సాధ్యం కావు.