అన్న పిలుపు కార్యక్రమాన్ని ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టారు. దీన్లో భాగంగా కొంతమంది తటస్థులతో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలోని ఏ పార్టీకీ మెజారిటీ రాదని, రాకపోతేనే మనకి మేలు అన్నారు. అత్యధిక ఎంపీ స్థానాలు మన చేతులో పెట్టుకుని… కేంద్రంలోని ప్రభుత్వాన్ని శాసిస్తామన్నారు! ప్రత్యేక హోదా, రైల్వేజోన్ పై ఏ స్థాయిలో ఒత్తిడి తెస్తామనేది అప్పుడు చూపిస్తామన్నారు. అందుకే, ఎన్నికల ముందు ఎవరితోనూ పొత్తులు ఉండవన్నారు. ‘రేప్పొద్దున మనం గెలిచాక… నువ్వు సంతకం పెడితే, నేను సపోర్ట్ చేస్తా అంటాన’ని జగన్ చెప్పారు! ఎన్నికల ముందు ఎవ్వర్నీ నమ్మడం లేదని, ఒంటరిగానే పోరాటం ఉంటుందన్నారు.
కులాల కార్పొరేషన్లపై మాట్లాడుతూ… వైకాపా అధికారంలోకి రాగానే గ్రామాల్లోని ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ని ఏర్పాటు చేస్తామనీ, నవరత్నాలతోపాటు ప్రభుత్వ పథకాలూ, రేషన్ కూడా డోర్ డెలవరీ చేసేలా ఆ వాలంటీర్ పనిచేస్తారని జగన్ చెప్పారు. 45 ఏళ్లు నిండిన అక్కలకు రూ. 75 వేలు నాలుగు దఫాల్లో ఇస్తామనీ, అవి కూడా ఇంటికే వస్తాయన్నారు. ప్రతీ కులానికీ ఇలా న్యాయం జరుగుతుందనీ, కార్పొరేషన్లు చేసే పనులన్నీ ఇంటికే వస్తున్నప్పుడు… కార్పొరేషన్లు ఎందుకన్నారు జగన్. విశాఖ జోన్ మీద తనకు పూర్తి అవగాహన ఉందన్నారు! రైల్వే జోన్ తోపాటు ప్రత్యేక హోదాపై కూడా ఏం జరుగుతోందో అందరికీ తెలుసన్నారు. వాటిని సాధిస్తామన్న సంపూర్ణ విశ్వాసం తనకి ఉందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తన నుంచి కాపీ చేస్తున్నవని చెబుతూ ఎద్దేవగా మాట్లాడారు! ఎన్టీఆర్ అప్పట్లో కిలో బియ్యం రూ. 2కి ఇస్తానని హామీ ఇస్తే, అప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ 10 పైసలు తక్కువకే ఇచ్చిందనీ, ఎన్నికలకు ఆర్నెల్ల ముందు ఇలా ఇచ్చినా కూడా ప్రజలు నమ్మలేదనీ, ఇప్పుడూ అదే జరుగుతుందన్నారు. ఒక కుర్రాడు కష్టపడి పదో తరగతి పరీక్షలు రాస్తుంటే… గాలికి తిరిగిన మరొకడు కాపీ కొడితే మంచి మార్కులు ఎలా వస్తాయన్నారు.
జగన్ మాటలు మెరుపు కలల్లా ఉన్నాయి! విశాఖ జోన్, హోదా సాధించాలంటే… కేంద్రంలో హంగ్ రావాలి, జగన్ 25 ఎంపీ సీట్లు రావాలి, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడకూడుదు… కానీ, ప్రభుత్వం ఏర్పడకుండానే హోదా ఫైల్ మీద సంతకం పెట్టెయ్యాలట! ఎవరు పెడతారు, ఏ హోదాలో పెడతారు.. ఏమో..? ఇన్ని ఇఫ్స్ అండ్ బట్స్ కలిసొస్తేనే విభజన హామీలను వైకాపా సాధించగలదని జగన్ చెప్తున్నారు. అంటే, వీటిల్లో ఏది అనుకూలించకపోయినా అంతేనన్నమాట! ఒక నాయకుడిగా హక్కుల్ని పోరాడి సాధించుకుంటాం అనాలిగానీ, పరిస్థితులు కలిసొచ్చే వరకూ వేచి చూస్తామనడమేంటో? ఇంకోటి… 50 ఇళ్లకి ఒక వాలంటీర్ అంటున్నారు, పథకాల డోర్ డెలివరీ అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధి కూడా నేరుగా ప్రజల అకౌంట్లలోకే వెళ్తున్నాయి కదా. కొత్తగా ఈ వాలంటీర్లు ఏం చేస్తారు..? ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వైకాపా హామీల్లో అమలు విధానాన్ని స్పష్టంగా ప్రజలకు విశ్లేషించి చెప్పలేకపోతున్నారు.