ఎక్స్‌ప్రెస్ టీవీ చానల్ , కోస్టల్ బ్యాంక్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న చిగురుపాటి జయరామ్ హత్యకు గురయినట్లు పోలీసులు నిర్ధారించారు. కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో ఆయన కారు జాతీయరహదారిపై రోడ్డు పక్కన పొల్లాల్లో పడి ఉంది. అందులో ఆయన విగతజీవిగా పడి ఉన్నారు. ప్రమాదం జరిగిన సంకేతాలు పెద్దగా లేకపోవడం.. డ్రైవర్ ఆచూకీ కూడా లేకపోవడంతో.. అనుమానాస్పదమృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవి ఫుటేజ్ లను టోల్గేట్ల నుంచిసేకరించి… పరిశీలించారు. విచారణలో పోలీసులు హత్యగా నిర్ధారించారు. చిగురిపాటి జయరాం రెండు రోజుల క్రితమే జూబ్లీహిల్స్ తన నివానం నుండి ఒంటరిగా కారులో బయలు దేరారు. ఆ తర్వాత దసపల్లా హోటల్‌కు వెళ్లి.. అక్కడి నుంచి విజయవాడ బయలుదేరినట్లు పోలీసులు గుర్తించారు. ఒంటరిగానే ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పటికీ.. జయరాంకు మరో వ్యక్తి జత కలిశారు. పతంగి టోల్ గేట్ వద్ద సీసీ కెమెరాల ఫుటేజ్ లో మరో వ్యక్తి టోల్ చెల్లించినట్లు గుర్తించారు. కారు డ్రైవ్ చేసింది.. జయరాం కాదని పోలీసులు గుర్తించారు.
చిగురుపాటి జయరాం.. కుటుంబం అమెరికాలో ఉంటోంది. ఆయన అమెరికాలోనూ.. కొన్ని ఫార్మా కంపెనీలను ప్రారంభించారు. అక్కడ కూడా విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నారు. నెల రోజుల క్రితం వరకూ జయరాం అమెరికాలోనే ఉన్నారు. నెల రోజుల క్రితమే అమెరికా నుండి హైదరాబాద్ వచ్చారు. తల్లి చనిపోయిన తరువాత ఆస్తి విషయంలో కుటుంబ కలహాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అమెరికా లో ఉన్న జయరాం భార్య పిల్లలకు పోలీసులు సమాచారం ఇచ్చారు. చిగురుపాటి జయరామ్ ప్రసాద్.. అమెరికాలో విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు గడించారు. ఫార్మా రంగంలో ఆయన అనేక విజయాలు సాధించారు. భారత్‌కు తిరిగి వచ్చిన వచ్చిన తర్వాత కూడా.. ఫార్మా కంపెనీలు ప్రారంభించారు. జెనోటెక్ లాబోరేటరిసీ, హెమరస్ ఎల్ఎల్సీ, టెక్ట్రాన్ పాలీ లెన్సెస్ అనే కంపెనీలకు ఫౌండర్ గా ఉన్నారు. అదే సమయంలో.. మీడియా రంగంలోకి అడుగు పెట్టారు.
ఎక్స్‌ప్రెస్ టీవీని ప్రారంభించారు. ప్రారంభంలో.. ఆ టీవీ చానల్ మెరుగైన పని తీరు కనబర్చినప్పటికీ… ఆర్థిక సమస్యలతో కుంగిపోయింది. చివరికి… ప్రసారాలు నిలిచిపోయాయి. కృష్ణా జిల్లాలో సహకార బ్యాంక్ ను ఏర్పాటు చేశారు. భారత్‌లో వ్యాపారాలు చేయడానికి వచ్చిన ఆయన అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న ప్రచారం జరుగుతోంది.ఈ ఆర్థిక వ్యవహారాలు, కుటుంబంలో గొడవల కారణంగా.. హత్య జరిగి ఉండవచ్చన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.