రాంగోపాల్ వర్మ- భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చాలా అరుదుగా లభించే ప్రతిభావంతులైన దర్శకుల్లో ఒకడు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా.. రాంగోపాల్ వర్మ ప్రతిభ, మేకింగ్‌లో ఆయన అనుసరించే విప్లవాత్మకమైన ధోరణి విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. దర్శకుడిగా ఆయన మేకింగ్‌కు ఫిదా అయిపోయిన వారు, భక్తులుగా కాదు, వీరభక్తులుగా మాత్రమే చెలామణీ అవుతుంటారు.
సదరు రాంగోపాల్‌వర్మ సినిమారంగం ఆనుపానులు ఔపోసన పట్టేసిన వ్యక్తి. ఇవాళ్టి రోజుల్లో ఎంత కష్టపడి సినిమా తీసినప్పటికీ.. ఓపెనింగ్స్ రోజుల్లో వచ్చే కలెక్షన్లు తప్ప.. మరొకటి సాధ్యం కాదు అనే వాస్తవం ఆయనకు తెలుసు. సినిమా అద్భుతంగా ఉంటే కొన్నిరోజులకు పైరసీ బారిన పడుతుంది. బాగా లేకపోతే కొన్నిరోజులకు తిరిగొచ్చేస్తుంది. అంటే ”బాగున్నా బాగాలేకపోయినా.. ఆడేది మాత్రం కొన్నిరోజులే” అనే సిద్ధాంతాన్ని ఆయన బాగా వంటపట్టించుకున్నారు. ఓపెనింగ్ కలెక్షన్లు దక్కితేచాలు అన్నట్లుగా.. అలా దక్కించుకోవడం కోసం ప్రతి సినిమా విడుదలకు ముందు దానికి సంబంధించి విపరీతమైన వివాదాన్ని లేవనెత్తుతుంటారు. నిజానికి సదరు సినిమాలు విడుదల కాగానే, దానికి సంబంధించి రేగిన వివాదాలన్నీ తుస్సుమని చప్పబడిపోతుంటాయి.
అదే రాంగోపాల్‌వర్మ మార్కెటింగ్ టెక్నిక్. అదే ఆయన విజయసూత్రం.
==
అచ్చంగా ఇప్పుడు కూడా రాంగోపాల్ వర్మ అదే సూత్రాన్ని అవలంబిస్తున్నారు. బెజవాడలో ఉండే స్థానిక రాజకీయాలకు, రాజకీయ హత్యోదంతాలకు సంబంధించి ఆయన ‘వంగవీటి’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది వంగవీటి రంగా, వారి కుటుంబంలో జరిగిన హత్యలకు సంబంధించిన అంశాలతో రూపుదిద్దుకుంటున్న చిత్రంగా ప్రచారంలో ఉంది. ఇంచుమించుగా గతంలో పరిటాల రవి హత్యకు సంబంధించి వర్మ రూపొందించిన రక్తచరిత్ర లాగానే విజయవాడ ఫ్యాక్షన్ కక్షల రాజకీయాలకు సంబంధించి ఈ చిత్రం ఉంటుంది. అక్కడే అసలు వివాదం రేగుతోంది.
ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో వంగవీటి రంగా కొడుకు రాధా మాట్లాడుతూ.. రాంగోపాల్‌వర్మ గనుక.. తన తండ్రి రంగా జీవితకథ ఆధారంగా రూపొందించబోతున్న ‘వంగవీటి’ అనే చిత్రంలో ఏకపక్షంగా వ్యవహరిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు. దానిపై రాంగోపాల్‌వర్మ స్పందిస్తూ.. రాధా గురించి చాలా చులకనగా మాట్లాడుతూ.. రంగా గురించి కొడుకు రాధాకంటే తనకే ఎక్కువ తెలుసునని.. రాధా పిల్లోడు అని వెటకారాలు చేస్తూ ట్విట్టర్లో కామెంట్ ద్వారా వేడిపుట్టిస్తున్నారు.
రంగా గురించి కొడుకు రాధాకంటె నాకే ఎక్కువ తెలుసు, అతనికి తెలియని పెదనాన్న గురించి కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు రాధా అప్పుడు పిల్లోడు.. చెప్పుడు మాటలు నమ్మాడు. కానీ నేను అప్పుడు స్పాట్లో ఉన్నా. ఎప్పుడూ స్పాట్ లో లేని వాళ్లు కేవలం స్పాట్లు పెట్టిన వాళ్లకి పుట్టినంత మాత్రాన వాళ్లే స్పాట్లు అనుకుంటే అది వాళ్ల పిల్లతనం. ‘రంగా తనయుడు ఇవాళ్టి రాధాకి అలనాటి రాధా వేల్యూలో 1శాతం అర్థమై ఉంటే తను కూడా మాటల రాధా కాకుండా చేతల రాధా అయ్యేవాదు’, ‘నేను నా సినిమా తేడాగా తీస్తే రంగా గారి ఫ్యాన్స్ ఊరుకోరు అని వార్నింగ్ ఇచ్చిన రాధా కి నా కౌంటర్ వార్నింగ్, ముందు ఫ్లాష్‌బ్యాక్ అర్థం చేసుకో’.
‘ఇవాళ్టి రాధా కన్నా ఆనాటి రాధా, రంగాలతో నేనెక్కువ సమయం గడిపాను. ఇవాళ్టి రాధాను పిల్లోడిగా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆడుకోవడం చూశాను. ‘వీడు ఎంత పెరిగినా ఇంకా పిల్లోడిలా బిహేవ్ చేస్తాడు” అని అప్పట్లో రంగా గారు నాతో తన కొడుకు గురించి అన్నారు. ఇప్పటికీ అతను అలాగే ఉండడం నాకు షాక్ కలిగిస్తోంది.’, ‘నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు కాని, కాపు అయ్యుండి కూడా కాపులెనకాల దాక్కునే కమ్మ మనస్తత్వమున్న వాడిని మొదటిసారిగా చూస్తున్నాను’… ఇలా సాగిపోయాయి.. వర్మ వ్యాఖ్యానాలు.
ట్విటర్ ఉన్నది కదాని ఎడా పెడా రెచ్చిపోయారు వర్మ. తనకు వార్నింగ్ ఇచ్చిన రాధాకు, కౌంటర్ వార్నింగ్ ఇచ్చారు. దానికి రాధా ఎలా ప్రతిస్పందిస్తారో… ఈ వివాదం ఇంకా ఎంత దూరం సా..గుతూపోతుందో వేచిచూడాలి.
==
చూడబోతే ముందు ముందు ఈ ‘వంగవీటి వివాదం’ అనే డెయిలీ సీరియల్ చాన్నాళ్ల పాటూ సాగే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఒక చిత్రంలో కేవలం గండి బాబ్జీ అనే పేరును విలన్‌కు పెట్టినందుకు అదే పేరున్న రాజకీయ నాయకుడు కోర్టును ఆశ్రయించడం, సినిమా విడుదల అయిన తర్వాత కూడా.. ఆ విషయంలో కోర్టు తీర్పును అనుసరించిన సినిమా మేకర్స్ ‘గండి’ అని వచ్చిన చోటల్లా వాయిస్ కట్ చేయడం అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే విధంగా.. వీరప్పన్ సినిమాకు సంబంధించి కూడా ఆ సినిమాలో వివాదాస్పద విషయాలు ఏమీ లేకపోయినా.. రిలీజ్‌కు ముందే పడిన కోర్టు కేసులు లాంటివి సినిమాకు హైప్ సృష్టించి మార్కెట్ పెంచాయని అనుకోవాలి. రాంగోపాల్ వర్మ నూటిదూకుడు వల్ల ఈ వంగవీటి చిత్రానికి సంబంధించి కూడా ముందుముందు కోర్టు కేసులు పడవచ్చు.. దర్శకుడు కోరుకునే విధంగా మరింత ఓపెన్ పబ్లిసిటీ లభించవచ్చు. ఇలాంటి చాలా పరిణామాలు జరగబోతున్నాయని అనిపిస్తోంది. వర్మ బెజవాడలో తనకున్న పరిచయాలను వాడుకుని, తానే బినామీగా ఎవరిద్వారానైనా కోర్టు కేసులు వేయించుకోవచ్చునని కూడా అనుమానిస్తే తప్పు కాదు.