ఆంధ్రప్రదేశ్ కు అన్నీ చేశామనీ, విభజన చట్టంలో ఉన్నవాటికంటే ఎక్కువ చేశామని అసెంబ్లీలో భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. కానీ, తమకు విమర్శించడమే రాష్ట్ర ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఆయన అన్నారు. కేంద్రానికి సరైన నివేదికలు ఇస్తే, తాను స్వయంగా ఢిల్లీకి వెళ్లి నిధులు తీసుకొస్తా అంటూ విష్ణుకుమార్ విమర్శించారు. దీంతో ఆగ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భాజపా నేతల తీరుపై మండిపడ్డారు. ‘ఎవరి కోసం ఇస్తారయ్యా… కొత్త రాష్ట్రం కాబట్టి. ఎవడబ్బ సొమ్ము ఇది..? కామన్ మేన్ కి ఉన్న ఇంట్రెస్ మీకు లేదు. ప్రజా ప్రతినిధిగా ఉండాల్సిన అర్హతలేదు మీకు. రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరీ రాష్ట్రంలో..? ఎవరికి ఊడిగం చేస్తారు..? ఏం చేస్తారయ్యా మమ్మల్ని… జైల్లో పెడతారా మీరు? ఒక కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసేది పోయి.. సిగ్గు వదలిపెట్టి మాట్లాడతా ఉంటే వింటా కూర్చోవాలా? న్యాయం జరిగే వరకూ వదిలిపెట్టమ’న్నారు ముఖ్యమంత్రి.
దక్షిణ భారతదేశంలో మీరు ఏమైనా చేశారా అని భాజపా ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు కేంద్రమంత్రిగా ఉండేవారనీ, ఆయన అన్ని రాష్ట్రాలూ తిరిగేవారనీ, కోపంతో ఆయన్ని కూడా వైస్ ప్రెసిడెంట్ చేసేశారన్నారు. అది ప్రమోషనా, పనిష్మెంటా దేవుడికే తెలియాలన్నారు చంద్రబాబు. తెలంగాణ నుంచి దత్తాత్రేయ ఉంటే అతన్ని తీసేశారనీ, కర్ణాటక నుంచి అనంతకుమార్ ఉండేవారనీ, కేంద్ర కేబినెట్ లో దక్షిణాది రాష్ట్రాలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారో ఒక్కసారి లెక్కేసుకొండన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారనీ, ప్రధాని మళ్లా రాష్ట్రానికి వస్తానంటున్నారనీ, ఏ ముఖం పెట్టుకుని వస్తారనీ, ఏం చేశారని వస్తారని ప్రశ్నిస్తున్నా అన్నారు. మహా అయితే ఐటీ రైడ్లు చేయిస్తారని తనకు తెలుసనీ, రాష్ట్రానికి న్యాయం జరగడం కోసం ఏమైనా ఫర్వాలేదన్న సంకల్పంతో తాను ఉన్నాను అన్నారు. విభజన అశాస్త్రీయంగా చేసి, రాష్ట్రానికి గాలికి వదిలేసి… ఇప్పుడేమో ఆంధ్రాలో గెలుస్తామని భాజపా నేతలు ఎలా చెబుతారన్నారు. ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్తే అక్కడికి తానూ వెళ్లాననీ, రాష్ట్రం కోసమే తాను తిరిగాను తప్ప, స్వార్థ ప్రయోజనాల కోసం కాదని చంద్రబాబు అన్నారు.
గంటకుపైగా ప్రసంగించిన సీఎం.. అంశాలవారీగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, హామీలు, విభజన చట్టంలోని అంశాలు ప్రస్థావించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల విషయంలో భాజపా వ్యవహరించిన తీరు, ఆంధ్రాపై కక్ష సాధింపుతో వ్యవహరించిన తీరును మరోసారి సభకు వివరించారు. వాస్తవానికి, ఇది సగటు ఆంధ్రుడి ఆవేదన అనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా, ఈ మధ్య ఏపీ భాజపా నేతలు కేంద్రాన్ని వెనకేసుకొస్తున్న తీరు సామాన్యుడికి సైతం ఆగ్రహం తెప్పిస్తోంది. సొంత రాష్ట్రం తరఫున పోరాడాల్సింది పోయి, కేంద్రాన్ని వెనకేసుకొస్తుంటే కడుపు రగిలిపోతోంది. ఆ ఆవేదన చంద్రబాబు ప్రసంగంలో కనిపించింది.