ప్రజలెవరు.. పనులు చేయాల్సిన పని లేదు. సంక్షేమం పేరుతో ప్రభుత్వాలే నేరుగా నగదు బదిలీ చేస్తున్నాయి. జీతాల మాదిరిగా ఎకౌంట్లలో పడిపోతున్నాయి. కేంద్రం, రాష్ట్రాలు కలిసి.. ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తం.. వేలల్లోకి చేరిపోతోంది. ఇది తగ్గేది కాదు. ప్రతి ఎన్నికల సమయానికి పెరిగేదే. ప్రస్తుతం.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో కుటుంబానికి ఎంత వెళ్తుందో చూద్దాం..!
నలుగురు సభ్యులున్న కుటుంబానికి ఏపీలో అందే మొత్తం : ఏడాదికి
ఐదెకరాలున్న కుటుంబానికి కేంద్రం నుంచి : రూ. 6000
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన మొత్తం : రూ. 12,000
నిరుద్యోగి కుమారుడికి భృతి : రూ. 24000
తల్లికి పెన్షన్, : రూ. 24000
డ్వాక్రా మహిళలకు : రూ. 10,000 ( వన్ టైం )
నలుగురు సభ్యులున్న రైతు కుటుంబానికి తెలంగాణలో అందే మొత్తం : ఏడాదికి
కేంద్రం నుంచి నెలకు : రూ. 6000
తెలంగాణ రైతు భరోసా : రూ. 50,000
తల్లికి పెన్షన్ : రూ. 24,192
నిరుద్యోగ భృతి : రూ. 36,192
ఇవి కాక రేషన్ , పండుగ కానుకలు, బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీ, బర్రెల పంపిణి, ఆదరణ పథకాలు.. ఇలా వ్యక్తిగతంగా వివిధ వర్గాలకు అందించే పథకాలు లెక్కలకు మిక్కిలి ఉన్నాయి. వాటిని కూడా లెక్కలోకి తీసుకుంటే.. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ. లక్ష పైనే ప్రభుత్వం నగదు పంపిణీ చేస్తున్నట్లు లెక్క తేలుతుంది. ఏడాదికి .. విడతల వారీగా కొన్ని పథకాలు.. నెల వారీగా మరిన్ని పథకాలు ప్రవేశపెట్టారు. నెలకు లెక్క వేస్తే.. కుటుంబానికి దాదాపుగా పది వేల రూపాయుల ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
ప్రజల్ని సోమరి పోతుల్ని చేయడం కాదా..?
ఇప్పటికే ఎకరానికి నాలుగు వేలు ఇస్తోన్న తెలంగాణ ప్రభుత్వం… త్వరలో పది వేలు ఇస్తామంటోంది. ఇపుడు కేంద్రం కూడా ఐదెకరాల లోపు ఉన్న పేద రైతులకు ఆరు వేల రూపాయాలను మూడు విడతల్లో ఇస్తామని బడ్జెట్ లో ప్రకటించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 10 వేలు చొప్పున ఐదు ఎకరాలకు యాభై వేలు ఇవ్వనుంది.. మరోవైపు కేంద్రం ఇచ్చే ఆరు వేలు.. ఇలా మొత్తం 56 వేలు ప్రతి ఏటా పేద రైతులకు అందుతాయ్. పంట వేయకముందే… ఐదెకరాలకు 56 వేల రూపాయాలు రైతుల అకౌంట్ లో పడుతుంటే… సాగు బాగుపడుతుందా..? లేక సంక్షోభంలోకి వెళ్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే… ప్రభుత్వాల హామీలు… ప్రజలను సోమరులుగా మారుస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇపుడు రైతుల బ్యాంక్ ఖాతాల్లో 56 వేల రూపాయాలు వేస్తే… అది వ్యవసాయ రంగానికి ఏ మేర ఊతమిస్తుందా…? అసలు డబ్బులిచ్చి చేతులు దులుపుకుంటే సరిపోతుందా..? అన్న ప్రశ్నలు తెర మీదికి వస్తున్నాయి. ఈ సొమ్ము మొత్తం పంటతో సంబంధం లేకుండా వస్తాయి. అంటే పంట వేసినా… వేయకున్నా ప్రభుత్వాల నుంచి వచ్చే డబ్బులు మాత్రం వస్తూనే ఉంటాయి.
వ్యవసాయానికి అంతులేని చేటు చేస్తున్నారా..?
గ్రామాల్లో ఉపాధి కల్పించేందుకు యూపీఏ సర్కార్ ప్రధాన మంత్రి గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పధకం వ్యవసాయ రంగాన్ని భారీగా దెబ్బతీసిందనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఉపాధి హామీ పనికి వెళ్లి… నాలుగు గంటలు పనిచేస్తే చాలు 200-300 రూపాయాలు ఖాతాలో పడుతున్నాయి. ఈ నాలుగు గంటల పని కూడా ఆడుతూ పాడుతూ చేసేస్తున్నారు. కానీ ఓ సాధారణ కూలీ పనికి వెళ్తే… అదే 200-350 రూపాయాలు వస్తున్నాయి. నాలుగు గంటలు కష్టపడకుండా పని చేస్తే ఎంత సొమ్ము ఖాతాలో పడుతుందో…. రోజంతా పని చేసినా అంతే వస్తోంది. దీంతో చాలా మంది వ్యవసాయ పనుల వైపు మొగ్గు చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అటు రైతులకు కూలీల కొరత ఏర్పడింది. బయటి నుంచి కూలీలను తీసుకొచ్చే పరిస్ధితి వచ్చింది. వీటికి తోడు ఉపాధి హామీ పధకంతో కూలీల రేట్లు భారీగా పెరిగిపోయాయి. దీంతో సాగు మరింత భారమైంది. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ పట్టించుకోని ప్రభుత్వాలు.. నేరుగా రైతులకు సాయం చేస్తామంటూ… ఫ్రీ ఆఫర్లు ఇస్తున్నాయి.
ప్రజల ఓట్లు కొనుగోలు చేయడమే ఏకైక మార్గమా..?
సంక్షేమ పధకాలు, హామీలు ఇపుడు ఓట్లు రాల్చుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర సర్కారు అదే బాటలో నడుస్తున్నాయ్. ప్రజల డబ్బుతోనే వాళ్ల ఓట్లను కొనుక్కునే ప్రయత్నం సాగుతోంది. ఇప్పుడిదే ట్రెండ్ గా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పెన్షన్ల తీరు ఇలాగే ఉంది. సంక్షేమ పధకమే అయినప్పటికీ… పెరిగిన ఫించన్లు వ్యవసాయ రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తెలంగాణలో వృద్ధులకు వెయ్యి రూపాయాల పెన్షన్ ఇస్తున్నారు. ఇది త్వరలో రెండు వేలు కాబోతుంది. ఇక వికలాంగులకు 1500 ఇస్తున్నారు. ఇది మూడు వేల రూపాయాలు కాబోతుంది. అంతేకాదు… వృద్ధాప్య ఫించను వయసు కూడా 57 ఏళ్లకు తగ్గించారు కేసీఆర్. ఇక ఏపీలోనూ ఇపుడిస్తోన్న ఫించన్లు పెంచుతామంటున్నారు. ఊరికే రెండు, మూడు వేలు చేతిలో పడుతుంటే… పనికి వెళ్లే వాళ్ల సంఖ్య కూడా పడిపోతోంది. ఈ సంక్షేమ పథకాలు… ఆర్థిక భారాన్ని పెంచడమే కాదు…. కొత్త సమస్యలకు కారణం అవుతున్నాయి. గ్రామాల్లో కూలీలు దొరక్కా.. బయటి రాష్ట్రాల వారిపై ఆధారపడుతున్నారు. అలా అని సంక్షేమం తప్పు కాదు…! కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకోవాల్సిన పాలకులు… సంక్షేమం మాయలో పడుతున్నారు.
ఆదాయం కోసం ప్రభుత్వాలేం చేస్తున్నాయి..?
ప్రభుత్వాలకు ఈ ఆదాయం అంతా ఎక్కడి నుంచి వస్తుంది. రాజకీయ నాయకులెవరూ.. తమ జేబుల్లోంచి తీసివ్వరు. అంతా పన్నుల ఆదాయమే. లేకపోతే అప్పులు. ఆ అప్పులు కూడా టాక్స్ పేయర్ల దగ్గర నుంచే వసూలు చేయాలి. లేకపోతే.. ఆ చేతుల్లో నగదు బదిలీ చేసి.. మరో రూపంలో వారి దగ్గర నుంచే వసూలు చేయాలి. వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు, విత్తనాల ధరలు పెంచి.. వాటిపై నుంచి రాబట్టుకోవడమో చేయాలి. ప్రభుత్వాలు.. ఇలా చేయడం వల్ల.. దేశాన్ని వెనక్కి తీసుకెళ్లడమే కానీ.. ఏ మాత్రం ప్రగతి శీలకం కాదు.