పార్లమెంటు ఎదుట మరోసారి మీడియాతో మాట్లాడారు ఏపీ ప్రతిపక్ష పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఆయన ఢిల్లీ వెళ్లి ఏం మాట్లాడతారో అందరికీ తెలిసిందే! అక్కడి నుంచి ఏపీలోని అధికార పార్టీపై విమర్శలు చేస్తారు, ఇప్పుడూ అదే చేశారు. కేంద్ర బడ్జెట్ అనంతరం విజయసాయి స్పందిస్తూ… ఆంధ్రాకి తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. గడచిన నాలుగు బడ్జెట్లలో కూడా ఆంధ్రాకి కేంద్రం అన్యాయం చేసిన మాట వాస్తవమే అన్నారు. ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం సవతి తల్లి ప్రేమనే చూపించిందన్నారు.
‘చంద్రబాబు నాయుడుగారు… నాలుగు సంవత్సరాలు మీరు కేంద్రంలో భాగస్వామి. నాలుగు బడ్జెట్లు మీ పార్టీ మంత్రి అశోక్ గజపతిరాజు కేబినెట్ లో భాగంగా ఆయనే అప్రూవ్ చేశారు. అనుకూలంగా ఓటేశారు. ఆ నాలుగు బడ్జెట్లలో కూడా ఆంధ్రాకి కేంద్రం న్యాయం చెయ్యలేదు. అప్పట్లో మీరందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ, ఈరోజు… కేంద్రంలోని ఎన్డీయే నుంచి బయటకి వచ్చి నాటకాలు ఆడుతున్నారు. మీరు చేసే బందులు, అధర్మ పోరాటాలను ప్రజలు నమ్మడం లేదని గుర్తుంచుకోవాలన్నారు’ అన్నారు విజయసాయి. గద్దె దిగే కాలం ఆసన్నమైందనీ, ఎప్పుడు మిమ్మల్ని గద్దె దించాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారనీ, ప్రత్యేక హోదాగానీ రాష్ట్ర అభివృద్ధిగానీ ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ తోనే సాధ్యమౌతుందని ప్రజలు గమనించారన్నారు.
కేంద్ర బడ్జెట్లో ఏపీకి భాజపా అన్యాయం చేస్తే… ఈయనేంటీ, ఏపీ ముఖ్యమంత్రిని విమర్శిస్తారు..? పార్లమెంటు ముందు నిలబడి భాజపాని నిలదీయాల్సింది పోయి… నాలుగేళ్లూ ఏం చేశారని ప్రశ్నిస్తారు..? నాలుగేళ్లపాటు కేంద్రం చుట్టూ ముఖ్యమంత్రి చక్కర్లు కొట్టిన విషయం తెలీదా..? నాలుగేళ్లయినా కేంద్రం తీరులో మార్పు రాకపోతే… కేంద్రమంత్రి పదవుల్ని టీడీపీ వదులుకుని, పోరాటం ప్రారంభించిన విషయం తెలీదా..? ఈ నాలుగేళ్లూ రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లారో, ఎంతగా తిరిగారో ప్రజలకు తెలుసు. మరి, ఈ నాలుగేళ్లూ ప్రతిపక్ష పార్టీగా ఆంధ్రాలో ఉంటూ… రాష్ట్ర ప్రయోజనాల కోసం భాజపాపై వైకాపా సాగించిన పోరాటాన్ని కూడా ప్రజలు చూశారు కదా. ఇంకోటి… వైకాపా నేతల ఫోకస్ అంతా ఎప్పుడు ‘గద్దె’ మీదే ఉంటుంది. అంతేతప్ప, రాష్ట్ర ప్రయోజనాలు అనే మాట పార్లమెంటు ముందు నిలబడ్డా కూడా గుర్తుకురాదు. ఆంధ్రాకి హోదా రావాలన్నీ, అభివృద్ధి కొనసాగాలన్నీ ఎవరు అధికారంలో ఉండాలో… ఏ అనుభవం రాష్ట్ర హక్కుల సాధనకు అక్కరకు వస్తుందో ప్రజలకు చాలా అంటే చాలా స్పష్టంగా తెలుసు.