ఇప్పుడు ఏపీ భారతీయ జనతా పార్టీ నేతలు స్పందించాల్సిన సమయం వచ్చింది..! మొన్నటికి మొన్న ఎంపీ హరిబాబు ఢిల్లీలో మాట్లాడుతూ… విశాఖ రైల్వేజోన్ కి కట్టుబడి ఉన్నామన్నారు. ఆంధ్రా అభివృద్ధికి మోడీ కట్టుబడి ఉన్నారని శాసన సభలో విష్ణుకుమార్ రాజు చెప్పారు. రెండ్రోజుల కిందటే, ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ‘ఏపీ అభివృద్ధికి మోడీ కట్టుబడుట’ అనే అంశంపై మాట్లాడారు. ఇలా వెనక్కి వెళ్తుంటే విభజన తరువాత నవ్యాంధ్ర అభివృద్ధికి ‘కట్టుబడి ఉన్నాం ఉన్నాం’ అంటూ ఊదరగొడుతూ చేసిన వ్యాఖ్యలు కోకొల్లలు. ఇప్పుడు చివరి బడ్జెట్ కూడా వచ్చేసింది. మరి, ఆ ‘కట్టుబడుట’ అంటే ఏంటో, అదెక్కడుందో ఏపీ భాజపా నేతలు ప్రజలకు ఇప్పుడైనా వివరిస్తారా?
ఆంధ్రాలో గెలిచేస్తామంటూ భాజపా బస్సు యాత్రలు ప్రారంభిస్తున్నా… రాజకీయంగా ఈ రాష్ట్రంలో తమకు ఏమాత్రం ఆదరణ దక్కదు అనేది ఈ బడ్జెట్ తో జాతీయ నాయకత్వమే లెక్క తేల్చేసిన పరిస్థితి ఇది. ఆంధ్రాలో భాజపాపై తీవ్ర వ్యతిరేకత ఉందనేది మోడీ షా ద్వయానికి తెలియంది కాదు. అలాంటప్పుడు, దీన్ని కాస్తోకూస్తో తగ్గించుకోవాలన్న ఉద్దేశం ఉంటే… ఆంధ్రాకు సానుకూలంగా ఒక్కటంటే ఒక్క నిర్ణయమైనా బడ్జెట్ లో ఉండేది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రానికి మెట్రో రైలు ప్రకటించి, వేల కోట్లు కేటాయించారు. ఇలాంటిది ఏదో ఒకటి ఏపీకి ప్రకటిస్తే… కొంతైనా ఉపశమనం ఉండేది. కానీ, ఆ దిశగా కేంద్రం ఆలోచించలేదంటే… ఆంధ్రాకి వారు ఇస్తున్న ప్రాధాన్యత ఏపాటిదో అర్థమౌతోంది. అంటే, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో ఒక్క సీటూ గెలిచే పరిస్థితి లేదనేది వారికి బాగా అర్థమైపోయింది. ఒక్క ఆంధ్రా మాత్రమే కాదు… మొత్తం దక్షిణ భారత రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో మోడీ సర్కారు ప్రాధాన్యత ఇవ్వలేదనీ చెప్పొచ్చు. అంటే, రాబోయే ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో వారికి దక్కే ఆదరణ ఏపాటిదితో ఈ బడ్జెట్ లో కనబరిచిన ప్రాధాన్యత ద్వారా వారే చెప్తున్నారు.
ఇక, ఏపీ భాజపా నేతలు ఏం మాట్లాడతారో చూడాలి. ఆంధ్రా అభివృద్ధికి ఇంకా మోడీ కట్టుబడి ఉన్నారని చెప్తే… పుండు మీద కారం చల్లినట్టే అవుతుంది. కనీసం ఇప్పటికైనా… కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు, పురందేశ్వరి, హరిబాబులు ఈ తరహా కట్టుబడి కామెంట్లు మానుకోవాల్సిన అవసరం ఉంది. వీరెంత గొంతు చించుకున్నా.. ఆంధ్రా విషయంలో కేంద్రం చిన్నచూపు కొనసాగుతూనే ఉంది. ఇక, ఆంధ్రాకి త్వరలో ప్రధాని మోడీ, అమిత్ షాలు వస్తామంటున్నారు. వారు కూడా ఇంకా ‘కట్టుబడి ఉన్నాం’ అని కామెంట్స్ చేస్తే, అంతకంటే దారుణం మరొకటి ఉండదు.