అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు చూసిన తర్వాత.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ… కనీసం తన ఉనికిని కాపాడుకోగలదా..అన్న ప్రశ్న అనుమానాలు వచ్చాయి. అందుకే… టీఆర్ఎస్ 80కిపైగా పంచాయతీల్లో విజయం సాధిస్తుందని.. ఆ పార్టీ నేతలు గట్టిగానే ప్రకటనలు చేశారు. కేటీఆర్ కూడా.. పంచాయతీ ఎన్నికల టార్గెట్లను పార్టీ నేతలకు ఇచ్చారు. మంత్రి వర్గ విస్తరణ కూడా.. కేసీఆర్ పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్కు ముడి పెట్టే ఆపేశారని చెప్పుకున్నారు. అయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ పుంజుకోగలిగింది. పార్టీ మరీ నేల బారుకు పడకుండా.. కాపాడుకోగలిగింది. ఓటమి బాధలో ఉన్నప్పటికీ..మాజీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తమ పట్టు జారకుండా చూసుకోగలిగారు.
పంచాయితీ ఎన్నికలు .. పార్టీ రహిత ఎన్నికలే అయినా ప్రతీ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు పార్టీల వారిగా విడిపోయి పోటీచేశారు. ఏదో ఓ పార్టీ అభ్యర్థులుగానే ప్రచారం చేసుకున్నారు. గ్రామ స్థాయిలో పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో పార్టీ సింబల్స్ లేకపోయినా గెలుపొందిన వారు ఏ పార్టీకి సంబందించిన వారనే విషయం స్పష్టంగానే తేలిపోయింది. సహజంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికారపక్షానికి సానుకూలంగా ఉంటాయి. రెండు నెలల కిందటే ఘన విజయం సాధించిన ఉత్సాహం ఉండంటతో.. టీఆర్ఎస్ హవానే నడిచింది. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పొల్చితే మాత్రం కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించి.. పార్లమెంట్ ఎన్నికల కోసం కాస్త ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో కారు పార్టీ 80 శాతంకు పైగా సీట్లు గెలుచుకుంది. పంచాయతీల్లో ఆ పర్సంటేజీ అరవై శాతానికి పడిపోయింది.
సుమారు 40 శాతం పంచాయతీలను టీఆర్ఎస్యేతర పక్షాలు కైవసం చేసుకున్నాయి. మూడు విడతల్లో మొత్తం 11,549 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. అందులో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 7,731 స్థానాల్లో విజయం సాధించారు. ఇందులో ఏకగ్రీవాలే.. 2,500 వరకూ ఉన్నాయి. అటూ ఇటుగా.. 5వేల పంచాయతీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ 2,698 చోట్ల 1825 గ్రామాల్లో ఇతరులు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలాపడ్డ కాంగ్రెస్ కు సర్పంచ్ ల ఎన్నికల ఫలితాలు మాత్రం కొంత ఊరటనిచ్చాయి.