జికా వైరస్. నిన్న స్వైన్ ఫ్లూ, మొన్న హెచ్ ఐ వి ప్రపంచాన్ని వణికించినట్టే ఇప్పుడు కొత్త వైరస్ హడలగొడుతోంది. ముఖ్యంగా బ్రెజిల్ లో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. పుట్టే బిడ్డలకు ఈ వైరస్ సోకకుండా అబార్షన్ కు అనుమతించాలంటూ వేల మంది గర్భిణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ కొత్త వైరస్ కు ఎఫెక్టివ్ వ్యాక్సిన్ ను కనుగొని, పూర్తిగా నిర్మూలించడానికి బ్రెజిల్ ప్రభుత్వం తంటాలు పడుతోంది.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐసిస్ ఉగ్రవాదుల తుపాకుల కంటే, దోమ ద్వారా వ్యాపించే జికా వైరసే ఎక్కువగా భయపెడుతోంది. బ్రెజిల్ లోని ప్రసిద్ధ పర్యాటక నగరం రియో డి జెనీరోలో ఈ ఏడాదిలోనే ఒలింపిక్స్ జరగబోతున్నాయి. ఆగస్టు 5 నుంచి 21 వరకూ ఈ విశ్వ క్రీడా వేడుక వైభవంగా జరుగుతుంది. మామూలుగా అయితే అందరూ ఎంతో ఆసక్తితో ఎదుచూసి, ఆనందంతో వీక్షించే వేడుకలివి. ఈసారి బ్రెజిల్ లో జికా వైరస్ విజృంభణతో అన్ని దేశాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. బ్రెజిల్ ఒలింపిక్స్ కు వెళ్లే తమ అథ్లెట్లకు ఈ వైరస్ సోకితే? వారు తిరిగొచ్చిన తర్వాత దేశమంతా వ్యాపిస్తే? ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతోంది.
క్రీడాకారులు, కోచ్ లు, మేనేజర్లు, ఫిజియోలు, ఇతర అధికారులు, క్రీడాభిమానులు… ఇలా రియో ఒలింపిక్స్ కు ప్రపంచం నలు మూలల నుంచి దాదాపు 5 లక్షల మంది తరలి వెళ్తారని అంచనా. ఒక్క అమెరికా నుంచే దాదాపు 2 లక్షల మంది రియో చేరుకుంటారట. ఇంత మందిలో ఎంత మందికి వైరస్ సోకుతుందో చెప్పలేం. ఆగస్టు కల్లా సరైన వ్యాక్సిన్ ను కనుగొని, ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం బ్రెజిల్ కు సాధ్యమా అనేది ప్రశ్న. ఒక వేళ సాధ్యమైనా, వైరస్ అవశేషాలు అణుమాత్రం మిగిలి ఉన్నా, మళ్లీ విజృంభించే ప్రమాదం ఉంది. కాబట్టి ఒలింపిక్స్ లో పాల్గొనడమా వద్దా అని కొన్ని దేశాల ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి.
ప్రస్తుతం బ్రెజిల్ లో సుమారు 15 లక్షల మందికి ఈ వైరస్ సోకిందని అంచనా. ఇంత మందికి నయం చేయడానికి ముందు సరైన మందు కావాలి. ఎవరికి సోకిందో కచ్చితంగా తెలుసుకోవడానికి పెద్ద ఎత్తున టెస్టింగ్ సదుపాయాలుండాలి. ఒక్క చిన్న గ్రామంలో బాధితులను పట్టించుకోకుడా వదిలేసినా అనర్థం తప్పదు. కాబట్టి సమూలంగా దీన్ని నిర్మూలించడం 8 నెలల్లో సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అందుకే, అథ్లెట్లను పంపి వైరస్ ను తెచ్చుకోవడం కంటే ఒలింపిక్స్ ను బహిష్కరించడమే మేలనే వాదన కూడా వినవస్తోంది. పైకి మాత్రం ఏ దేశమూ ఇంత వరకూ ఈ మాట అనడం లేదు. కానీ లోలోపల మధనపడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. క్రీడాకారులకు వైరస్ సోకని విధంగా కట్టడి చేస్తామని బ్రెజిల్ ప్రభుత్వం ఒకవేళ హామీ ఇచ్చినా, అది సాధ్యమా అనేది ప్రశ్న. క్రీడలు చూడటానికి వెళ్లిన వారు టూరిస్ట్ స్పాట్ లకు విహార యాత్రగా వెళ్తారు. వారు వైరస్ బారిన పడరనే గ్యారంటీ లేదు. వారు స్టేడియం లోపలికి వచ్చినప్పుడు అథ్లెట్లకు వ్యాపించదని ఎవరూ భరోసా ఇవ్వలేరు. ఈసారి ఒలింపిక్స్ ఎలా జరుగుతాయో, జరుగుతాయో లేదో అనేది ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్న.