ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాధవ్… అటు మండలి లోపల, బయట వ్యవహరించిన తీరు చర్చనీయాంశమవుతోంది. మండలిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి.. గందరగోళం సృష్టించడమే కాదు.. బయటకు వెళ్లి మండలి తీర్మాన కాపీల్ని మీడియా ముందు చించేసినట్లు షో చేశారు. చంద్రబాబు వల్లే ఏపీకి రాలేదంటూ.. తమ చేతకాని తనాన్ని పక్కాగా.. పక్క వాళ్ల మీదకు తోసే ప్రయత్నాన్ని సోము వీర్రాజు, మాధవ్ ఇద్దరూ చేశారు. దీన్నిపై నిరసన వ్యక్తం చేసిన.. టీడీపీ సభ్యులపై అభ్యంతరకర భాష ప్రయోగించి గందరగోళం చేశారు. వారు మండలిలో మాట్లాడిన వాటిలో.. ఏపీకి రావాల్సిన విభజన హామీల విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేంద్రం ఇవ్వకపోయినా పర్వాలేదన్నట్లుగా మాట్లాడారు. మండలి చైర్మన్‌తో సోము వీర్రాజు.. పోడియం దగ్గరకు వెళ్లి మరీ వాదన పెట్టుకున్నారు.
సోము వీర్రాజు, మాధవ్.. ఇద్దరూ వ్యవహరించిన తీరు… అసెంబ్లీ లాబీల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ వైపు.. సొంత గడ్డకు అన్యాయం జరుగుతున్నా… స్పందించడం లేదని.. పౌరుషం లేదా.. అని చంద్రబాబు నిలదీస్తున్నారు. అదే సమయంలో మండలిలో వీరు.. ఆ పౌరుషానికి భిన్నంగా.. ఏపీకి కన్నా.. తమకు బీజేపీనే ఎక్కువ అన్నట్లుగా.. ఏపీకి ఏమీ రాకపోయినా… పర్వా లేదు.. తమ పార్టీ మాత్రం అన్నీ ఇచ్చేసిందని చెప్పుకోవాలన్నట్లుగా వ్యవహరించారు. మీడియా ముందుకు వచ్చి తీర్మాన ప్రతులు చించేయడం కూడా… కలకలం రేపింది. నారా లోకేష్ సైతం వీరి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాప్రతినిధులుగా… వారు బీజేపీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉండవచ్చు కానీ.. నిజానికి వారు… ముందుగా ప్రజలకు ప్రతినిధులు. ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీ ప్రయోజనాలు కాపాడటంలో.. ఏ మాత్రం విఫలమైనా.. వారి విధులకు వారు న్యాయం చేయనట్లే. కానీ.. వారు ఏపీ ప్రయోజనాలు కాపాడటం కాదు.. అసలు అవసరమే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తమకు తమ పార్టీనే ప్రధానం అన్నట్లుగా చెలరేగిపోతున్నారు. ఈ మాత్రం పౌరుషం.. కేంద్రంపై.. ఒక్క సారి చూపించి ఉంటే.. కనీసం.. ఏపీలో తమ పార్టీ నేతలు.. ఎందుకు ఇలా అవుతున్నారో.. మోడీ, షాలు కనీసం అర్థం చేసుకుని ఉండేవారు. కానీ.. అలాంటి ప్రయత్నం చేయకపోతే.. సొంత రాష్ట్రం కన్నునే పొడుస్తున్నారన్న అభిప్రాయం వచ్చే విధంగా ప్రవర్తించడం వివాదాస్పదం అవుతుంది.