నిన్ననే జనాకర్షక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది మోడీ సర్కారు..! ఇది ట్రైలర్ మాత్రమే… అసలు సినిమా ఎన్నికల తరువాత ఉంటుందన్నట్టు ఆయనే ఊరించారు. శనివారం కోల్ కతాలో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. భాజపాకి పెరుగుతున్న జనాదరణను చూసి మమతాకి వణుకు పుడుతోందన్నారు. నిన్న పార్లమెంటులో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రకమైందన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత నిరాదరణకు గురౌతున్న అన్ని కులాలవారికీ, రైతులకు, మధ్య తరగతి ప్రజలకు, కార్మికులకు అందరికీ న్యాయం చేస్తామన్నారు. రైతుల కోసం ఏడాదికి రూ. 6 వేలు సాయం అందిస్తున్నామనీ, దాన్లో భాగంగా తొలి విడత సాయం సొమ్ము త్వరలోనే రైతుల బ్యాంకు అకౌంట్లలో పడుతుందని మోడీ చెప్పారు. తమకు పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక, తమ కార్యకర్తలపై దీదీ దాడులు చేయిస్తున్నారంటూ ఆరోపించారు.
ఠాకూర్ నగర్ లో ప్రధాని ఈ సభ ఎందుకు పెట్టారంటే… తృణమూల్ కాంగ్రెస్ కంచుకోట నుంచే భాజపా లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి. ఐదేళ్లపాటు పరిపాలించిన ప్రధాని మోడీ… ఈ సభలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలీ… తమ పాలనలో సాధించిన విజయాలపై కదా! కానీ, ప్రధాని ప్రసంగంలో ఐదేళ్ల పాలన, విజయాలు లాంటి ప్రస్థావనే లేదు. నిన్నటికి నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి గొప్పగా ఆయన చెబుతున్నారు. ఈ బడ్జెట్ ట్రైలరే అనీ, రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని మోడీ చెప్పడం విశేషం..! ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన నోట్ల రద్దు నిర్ణయ వైఫల్యం నుంచి దేశాన్ని గట్టెక్కించారో లేదో చెప్పలేదు. నల్లధనం నిర్మూలన జరిగిపోయిందని అనేశారుగానీ… ఎలా చేశారు, ఆ లెక్కలేంటనేవి చెప్పలేదు!
లోక్ సభ ఎన్నికల్లో భాజపా ప్రచారవ్యూహం ఏంటో పశ్చిమ బెంగాల్ సభతో స్పష్టమౌతోందని అనొచ్చు. గత ఎన్నికల మాదిరిగా ఈసారి మోడీ హవా మీద భాజపా ఆధారపడటం లేదు. అంతేకాదు, గడచిన ఐదేళ్లలో మోడీ సాగించిన పాలనపై కూడా ఆధారపడి ప్రచారానికి వెళ్తున్నట్టు లేదు! కేవలం, ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ నే ప్రజలకు చూపించి… తాత్కాలిక తాయిలాలను ఎరగా వేసి ఎన్నికలకు వెళ్తున్నారు. మోడీ హవా మీద ఆధారపడేందుకు సిద్ధంగా లేనట్టున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వం వేలుపెట్టిన తీరు, సీబీఐ వ్యవహారం, ఆర్బీఐ వ్యవహారాల్లో జోక్యం… ఇవేవీ ప్రజలకు గుర్తుకు రాకుండా ఈ బడ్జెట్ ను చూపించి ఎన్నికలను దాటేద్దామని అనుకుంటున్నట్టుగా ఉన్నారు.