ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. అన్ని పార్టీలు ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చికల్లా అభ్యర్థులను ప్రకటించే ప్రణాళికలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల పరిశీలన కోసం జనసేన వినూత్న విధానాలను అవలంబించనుంది . ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఎంపీ పదవికి పోటీ చేయాలి అనుకునే అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన కోసం జనసేన స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.
పార్టీ తరపున పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన కోసం స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు గా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మాదాసు గంగాధరం, హరిప్రసాద్ లతో పాటు మరో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎమ్మెల్యే లేదా ఎంపీ పదవికి పోటీ చేయాలనుకునేవారు దరఖాస్తులను పంపవచ్చని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వీరు పంపిన దరఖాస్తులను ఈ స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి, వడ పోత చేసి, ఎంపిక చేసిన దరఖాస్తులను జనరల్ బాడీ ముందు ఉంచుతారు. జనరల్ బాడీ ఇందులోంచి అభ్యర్థులను ఎంపిక చేసుకుని ఆయా స్థానాల్లో పోటికి నిలబెడతారు. ఈ స్క్రీనింగ్ కమిటీ విజయవాడ కేంద్రంగా పనిచేస్తుంది అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
ఏది ఏమైనా జనసేన పార్టీ ఆరంభం నుండి కూడా, కంటెంట్ రైటర్లు, సోషల్ మీడియా శతాగ్ని విభాగాలు అంటూ కొంత వైవిధ్యాన్ని చూపిన జనసేన , అభ్యర్థుల ఎంపికలో కూడా అదే తరహాలో వైవిధ్యాన్ని చూపనుందని అర్థమవుతుంది. అయితే ఇది ఎంతవరకు ఫలితాలనిస్తుందనేది ఎన్నికలయ్యాకే తెలుస్తుంది.