కృష్ణాజిల్లా కేసరపల్లి లో చంద్రబాబు సంక్షేమ పండగ సభ నిర్వహించారు. ఈ సభలో మాట్లాడిన చంద్రబాబు జగన్ మీద సెటైర్లు, పవన్ కళ్యాణ్ ప్రస్తావన ల తో తన స్పీచ్ నింపేశారు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసే ఈ కార్యక్రమంలో, చెక్కుల పంపిణీ అనంతరం మాట్లాడిన చంద్రబాబు , ముందు తన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించారు. ఆ తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ మీద సెటైర్లు వేశారు. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ ను ప్రస్తావిస్తూ పాజిటివ్ గా మాట్లాడారు. వివరాల్లోకి వెళితే..
మొన్నీ మధ్య ఒక జాతీయ మీడియా సర్వేలో వైఎస్సార్ సీపీకి 25 ఎంపీ సీట్లకు గాను 23 సీట్లు వస్తాయని చెప్పడం, పైగా కేంద్రంలో జగన్ చక్రం తిప్పుతాడు అని అన్నట్లుగా సర్వే ఫలితాలను విడుదల చేయడం తెలిసిందే. ఆ సర్వే వచ్చిన అనంతరం వైఎస్ఆర్ సీపీ నేతలంతా ఆనందడోలికల్లో మునిగితేలుతూ అధికారంలోకి కచ్చితంగా వచ్చేస్తామన్న ధీమా వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారు. ఇదే సంగతిని పరోక్షంగా ప్రస్తావించిన చంద్రబాబు, సర్వే ఫలితాలను చూసి కొంతమంది సంబరాల్లో మునిగి తేలుతున్నారని వారి భ్రమలు త్వరలోనే పటాపంచలవుతాయని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా జగన్ పై దాడి కేసును ప్రస్తావిస్తూ, కోడి కత్తి కేసు లో నన్ను నిందితుడుగా చూపించాలని, ప్రభుత్వంపై బురద చల్లాలని కేసీఆర్, జగన్, మోడీ కలిసి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
జగన్ మీద ఇలా సెటైర్లు విమర్శతో విరుచుకుపడ్డ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద మాత్రమే సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్, కేంద్రం నుంచి 80 వేల కోట్ల దాకా మనకు నిధులు రావాలని లెక్కగట్టాడని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ నిధులు ఇచ్చి కేంద్రం సహకరించి ఉంటే రాష్ట్ర మరింతగా అభివృద్ధి చెందేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రెండు నెలల కిందటి వరకు – “పవన్ కళ్యాణ్ జాయింట్ ఫాక్ట్స్ ఫైండింగ్ కమిటీ వేసి, ఆ తర్వాత పారిపోయాడని ” విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ మీద తన ఉపన్యాసాలలో సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నాడు.
మొత్తానికి చంద్రబాబు స్పీచ్ – జగన్ మీద విమర్శలు సెటైర్లతో సాగుతూ, మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ మీద సాఫ్ట్ గా ప్రస్తావనలు తీసుకొస్తూ కొనసాగింది. దీని భావం ఏమిటన్నది తెలియాలంటే ఎన్నికల దాకా ఆగాల్సిందే.