సీబీఐ కొత్త డైరెక్టర్ గా రిషి కుమార్ శుక్లాను నియమించారు. ఈయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రధాని నేతృత్వంలోని కమిటీ రిషి కుమార్ పేరును ఖరారు చేసింది. నిజానికి, గత నెలలోనే ఈ కమిటీ ఐదుగురు పేర్లతో తుది జాబితా తయారు చేస్తే, కమిటీ సభ్యుల్లో ఒకరైన మల్లికార్జున ఖర్గే కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, తాజాగా జరిగిన కమిటీ సమావేశంలో రిషి కుమార్ నియామకాన్ని ఖర్గే వ్యతిరేకించలేదు. దీంతో ఏకాభిప్రాయం వ్యక్తమైందని చెప్పొచ్చు. శుక్లా 1983 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. మధ్యప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కమిటీకి డైరెక్టర్ గా ఈయన పనిచేశారు. పెద్దగా వివాదాలు లేని వ్యక్తిగా ఈయనకి మంచి పేరే ఉంది.
అయితే, ఈ మధ్య కాలంలో సీబీఐలో చోటు చేసుకున్న పరిణామాలు తెలిసినవే. అలోక్ వర్మ బదిలీ, రాజీనామా వ్యవహారం, ఇంకోపక్క రాకేష్ ఆస్తానా వివాదాలను ఎదుర్కొంటున్నారు. సీబీఐలో కొంతమంది ఉద్యోగులు కూడా బదిలీల మీద కోర్టులను ఆశ్రయించారు. ఒక్కమాటలో చెప్పాలంటే… అత్యంత కీలమైన సీబీఐ మొత్తమే ఇప్పుడు పూర్తిగా చెల్లా చెదురైనట్టుగా కనిపిస్తోంది. అంతేకాదు, దేశవ్యాప్తంగా సీబీఐ ఇమేజ్ మీద కూడా తీవ్రమైన చర్చ జరిగిన సంగతీ తెలిసిందే. ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో డైరెక్టర్ గా శుక్లా బాధ్యతలు తీసుకోబోతున్నారు. కాబట్టి, ఇకపై సీబీఐ పనితీరు ఎలా ఉంటుందా అనే కోణం నుంచి ప్రజలూ అటువైపే చూస్తారు.మళ్లీ పూర్వ వైభవం వచ్చే వరకూ ఫోకస్ అంతా కచ్చితంగా సీబీఐ మీద ఉంటుంది.
ఈ నేపథ్యంలో శుక్లా ముందు చాలా సవాళ్లు ఉన్నాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా కొన్ని కేసులున్నాయి. ఇవన్నీ దాదాపుగా ఏదో ఒక కోణంగా, ఏదో ఒక రాజకీయ పార్టీకి లింక్ ఉన్నవే, బడా నాయకుల ప్రమేయంతో ఉన్నవే! యూపీలో అక్రమ మైనింగ్ కేసు, శారదా చిట్స్ కేసు, అగస్టా కేసు, మాజీ కేంద్రమంత్రి చిదంబరం నిందితునిగా ఉన్న కేసులున్నాయి.. ఇలా రాజకీయాలను ప్రభావితం చేసే కీలకమైన కేసులన్నీ ఇప్పుడు శుక్లా ముందుకు వస్తున్నాయి. యూపీకి సంబంధించిన కొన్ని కేసుల్లో మాయావతి, అఖిలేష్ లను కూడా లాగే అవకాశం ఉన్నవి కొన్ని ఉన్నాయనే ప్రచారమూ ఉంది! పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లక్ష్యంగా ఇప్పటికే శారదా చిట్స్ కేసు ఉందనీ తెలిసిందే. ఇలాంటి కొంతమంది ప్రముఖ నేతలను లక్ష్యంగా కేసుంటాయనే కథనాలు కూడా ఈ మధ్య వినిపిస్తున్నాయి. ఎందుకు వీరి పేర్లే వినిపిస్తున్నాయనేది ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన పనిలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంలో ఇలాంటి కీలకమైన కేసులపై సీబీఐ తీరు ఎలా ఉంటుందో చూడాలి. అన్నిటికీమించి, దేశవ్యాప్తంగా సీబీఐ విశ్వసనీయతపై ఈ మధ్య చాలా చర్చే జరిగింది. ఆ ఇమేజ్ ను మార్చాల్సిన బాధ్యత కూడా శుక్లాపైనే ఉంది. మరి, కొత్త డైరెక్టర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించాక ఎలాంటి పరిణామాలుంటాయో వేచి చూడాలి.