ఎన్నికల ముందు ఒక లెక్క, ఎన్నికల తరువాత మరో లెక్క! గతంలో ఎన్నికలు అవసరాలు అనుకున్న ఆ చిన్నచిన్న పదవులే… ఇప్పుడు ప్రభుత్వం నడపడానికి అడ్డంకులుగా మారినట్టున్నాయి. మనం మాట్లాడుకుంటున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గురించే..! కొసరు పదవుల్ని వదులుకోవాలంటూ నేతలకు సీఎం కేసీఆర్ సూచించినట్టు సమాచారం. వివిధ సంఘాలు, కుల సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉంటున్న తెరాస నాయకులకు కేసీఆర్ ఈ సూచన చేసినట్టు తెలుస్తోంది. దాన్లో భాగంగానే తెలంగాణ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్ష్య పదవికి హరీష్ రావు రాజీనామా చేశారు. అయితే, దీనిపై రకరకాల కథనాలు వెలువడ్డాయిగానీ, ముఖ్యమంత్రి సూచన మేరకే హరీష్ ఈ పని చేశారని ఇప్పుడు తెలుస్తోంది.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి పదవిలో ఎంపీ కవిత ఉన్న సంగతి తెలిసిందే. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా టీబీజీకేయస్ తరఫున ఆమె కీలక బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు, ఓరకంగా తెలంగాణ కార్మికుల్లో తెరాసను మరింత బలంగా తీసుకెళ్లడానికి ఈ సంఘం చాలా ఉపయోగపడిందనీ చెప్పొచ్చు. అయితే, టీబీజీకేయస్ గౌరవ అధ్యక్ష పదవికి ఎంపీ కవిత కూడా ఇప్పుడు రాజీనామా చేశారు. కమ్మ సంఘం అధ్యక్షుడిగా ఉన్నా అరికెపూడి గాంధీ, వెలమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ భానుతోపాటు పలువురు తెరాస నేతలకు కూడా ఆయా పదవుల నుంచి తప్పుకోవాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఆదేశాలు అందినట్టు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కార్మిక సంఘాలు, కుల సంఘాలకు ప్రతినిధులుగా ఉండొద్దని నాయకులకు కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది.
ఉన్నట్టుండి కేసీఆర్ ఇలా ఎందుకు సూచించారు, ఎన్నికల్లో ఎంతో కీలక పాత్ర పోషించిన కుల సంఘాలు, కార్మిక సంఘాల గౌరవాధ్యక్ష పదవుల్ని వదిలేయాలని ఎందుకు చెప్తున్నారనే అంశంపై తెరాస వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులుగా ఉంటూ ఇలాంటి సంఘాలకు అధ్యక్షులుగా కొనసాగితే… పరిపాలనలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి భావించారని గులాబీ నేతలు కొందరు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఈ సంఘాలకు నాయకత్వం వహించేందుకు తెరాస నేతలే ఆసక్తి చూపారు. అధికార పార్టీకి చెందిన కీలక నేతలే తమ సంఘాలకు అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి… చాలా మేలు జరుగుతుందని ఆయా సంఘాల్లోవారు భావించారు. ఎన్నికల్లో కూడా తెరాస జెండానే వారూ మోశారు! ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, ఆ పదవుల్లో తెరాస నేతలు కొనసాగితే పాలనకు ఇబ్బంది అవుతుందట. అంటే, ఈ కొసరు పదవులు పార్టీ అవసరాలకి పనికొస్తాయిగానీ, పాలనకు అడ్డుపడతాయా..?