డాక్టర్ జే..! అమెరికాలోని ఫ్లోరిడా పారిశ్రామికవర్గాల్లో.. ముఖ్యంగా ఫార్మా, వెల్త్ మేనేజ్మెంట్ రంగాల్లో బాగా పరిచయం ఉన్న వ్యక్తి. అపారమైన వ్యాపార తెలివితేటలు, నాయకత్వ లక్షణాలతో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు గడించిన వ్యక్తి డాక్టర్ జే..!. ఈ డాక్టర్ జే… ఆంధ్రప్రదేశ్‌లో హత్యకు గురయ్యారు. ఈ “డాక్టర్ జే”నే.. చిగురుపాటి జయరాం. విజయవాడలో పుట్టి ఫ్లొరిడాలో స్థిరపడిన ఎన్నారై… చివరికి సొంత గడ్డపైనే హత్యకు గురయ్యారు.
కానూరు కుర్రాడు .. ఫ్లోరిడా ప్రముఖుడు..!
చిగురుపాటి జయరాం తండ్రి కృష్ణ మూర్తి మత్స్యశాఖలో ఉద్యోగి. చిన్నప్పటి నుంచి చదువులో ఉండే జయరాం.. తన మేథస్సును.. వ్యాపారపరంగా ఉపయోగించారు. సెంట్రల్ యూనివర్శిటీలో… పీహెచ్డీ చేసిన తర్వాత అమెరికా వెళ్లారు. అక్కడి కార్నెల్ యూనివర్శిటీలో ఎంబీఏ చేశారు. చదవులు పూర్తయిన తర్వాత.. అప్పుడప్పుడే ఫార్మా రంగంలో… ఎదుగుతున్న ర్యాన్ బాక్సీ లో భాగస్వామిగా చేరారు. ఆ తర్వాత వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు… అంతకు మించిన వివాదాలు ఆయన చుట్టూ ఉన్నాయి. విజయవాడకు చెందిన పద్మశ్రీతో వివాహం తర్వాత ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. క్యాన్సర్ చికిత్సలో వాడే ఔషధాలు, సంతాన లేమికి వాడే ఔషధాలు, డయాలసిస్ లో అవసరమయ్యే థెరపటిక్స్కు సంబంధించిన అనేక ఉత్పత్తులకు అవసరమైన పేటెంట్లు ఆయన దగ్గర ఉన్నాయి. భారత్‌లోని ఓ ప్రముఖ ఔషధ కంపెనీతో తలెత్తిన వివాదం ఆయన జీవితాన్ని మార్చేసిందని చెబుతారు. ఓ కంపెనీలో సహా భాగస్వామిగా ఉన్న క్రమంలో విభేదాలు తలెత్తడంతో దానిపై ఆయన కోర్టుకు వెళ్లారు. ఆ కేసు లో పరిహారంగా వందల కోట్లు పొందారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఒక్క ఫార్మా రంగంలోనే కాదు.. ఇతర రంగాల్లోనూ.. తన వ్యాపారాలు విస్తరించారు. ప్రస్తుతం అమెరికాలో వెల్త్ మేనేజ్ మెంట్ సేవలు అందిస్తున్న సైప్రస్ ట్రస్ట్ కంపెనీకి కూడా చైర్మన్ గా ఉన్నారు.
భారత్‌లో వ్యాపారాలతోనే చిక్కులు..!
పారిశ్రామికంగా ఉన్నత స్థానాలకు ఎదిగినా ఆయన చుట్టూ ఆది నుంచి వివాదాలే ఎక్కువగా ఉన్నాయి. పేటెంట్ల విషయంలో గొడవలు., భాగస్వాములతో విభేదాలు, ఉద్యోగులతో వివాదాలు చిగురుపాటి ప్రస్థానంలో సాధారణం అయ్యాయి. 2003 వరకూ.. భారత్‌లో వ్యాపారాల గురించి పెద్దగా పట్టించుకోని ఆయన.. ఆ తర్వాత నుంచి భారత్ లో ఔషధ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. హేమారస్ థెరపటిక్స్ 2003లో స్థాపించారు. ఈ కంపెనీ భారీ విజయం సాధించడంతో వెనుదిరిగి చూసుకోలేదు. ఇతర రంగాల్లో కూడా.. పెట్టుబడులు పెట్టారు. అయితే.. ఆయన చేసిన వ్యాపారాలన్నీ.. లో ప్రొఫైల్ బిజినెస్‌లు కావడంతో.. పారిశ్రామికవర్గాలకు తప్ప ఎవరికీ ఆయన గురించి పెద్దగా తెలియదు. కానీ.. ఎక్స్‌ప్రెస్ టీవీ పేరుతో టీవీ చానల్, కృష్ణా జిల్లాలో కోస్టల్ బ్యాంక్‌ను టేకోవర్ చేయడంతో.. ఆయన గురించి తెలుగు ప్రజల్లో చర్చ ప్రారంభమయింది. అయితే అక్కడా వివాదాలు తలెత్తాయి. బ్యాంక్ వ్యవస్థాపకులతో వివాదాలు తలెత్తడంతో.. కేంద్ర రెవిన్యూ సర్వీస్‌లో ఉన్న ఓ ఉన్నతాధికారి పరిష్కారం చేశారని చెబుతున్నారు.
వివాదాలతో పాటు విజయాలూ ఎక్కువే..!
చిగురుపాటి జయరాం… ఫార్మా రంగంలో.. సాధించిన విజయాలు ఆయనకు పేరు తెచ్చి పెట్టినా.. వ్యాపారవేత్తగా ఆయన వ్యవహారశైలి మాత్రం.. ఆయనకు చెడ్డపేరు తెచ్చింది. నష్టాల్లో ఉన్న పరిశ్రమలను వదిలించుకోవడానికి.. ఉద్యోగుల్ని రోడ్డున పడేయడానికి ఆయన క్షణం కూడా ఆలోచించరని చెబుతారు. కొన్నాళ్ల కిందట.. హైదరాబాద్‌లో కళ్లద్దాలు తయారు చేసే టెక్ట్రాన్ అనే కంపెనీ ఉండేది. నష్టాలు రావడంతో దాన్ని మూసేశారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదు. దాంతో వారు కేసు పెట్టడంతో కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. 2013లో జేఎస్డీ డేటా మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెట్టిన ఎక్స్ ప్రెస్ టీవీలోనూ అదే వివాదం తలెత్తింది. నెలల తరబడి ఉద్యోగులకు జీతాలు ఎగ్గొట్టారనే ప్రచారం ఉంది. దీనిపై జరిగిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. ఓ సాధారణ కుటుంబంలో పుట్టినా.. రూ. రెండు వేల కోట్ల విలవైన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు డాక్టర్ జే. ఆయన వ్యాపార పయనంలాగే.. ఆయన మరణం కూడా… సాధారణం కాదు..!