రాజధానిలో గ్రాఫిక్సే ఉన్నాయని.. అవి అద్భుతంగా ఉన్నాయని… చాలా మంది సెటైర్లు వేస్తూంటారు. కానీ ప్రణాళికలు ముందుగా పేపర్లపైనే.. గ్రాఫిక్స్ లోనే ఉంటాయని.. వాటి ఆధారంగానే కడతారని.. వారు అంచనా వేయలేకపోతున్నారు. ఇప్పుడా గ్రాఫిక్స్ వాస్తవ రూపంలోకి వస్తున్నాయి. మొదటగా… సిటీ సివిల్ కోర్ట్ భవనం రెడీ అయింది. దీన్ని ఇప్పటికి హైకోర్టు భవనంగా ఉపయోగిస్తున్నారు. ఐదు కోట్ల ఆంధ్రులు సగర్వంగా తల ఎత్తుకునే విధంగా అత్యంత అధునాత సౌకర్యాలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. రూ. 170కోట్ల రూపాయలతో హైకోర్టు భవన నిర్మాణం ఎల్ అంట్ టీ శరవేగంగా పూర్తి చేసింది. రెండు లక్షల 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణం.. 22 కోర్టు హాల్స్, ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాలు, ప్రత్యేక ఛాంబర్ సిద్దమయ్యాయి.
గ్రౌండ్ ఫ్లోర్ లో అడ్వకేట్ జనరల్ కార్యాలయం, రెండున్నర లక్షల ఫైల్స్ ను ఉంచేందుకు స్టోర్ రూం ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో 13కోర్టు హాల్స్, రెండవ అంతస్తులో పది కోర్టు హాల్స్ తో పాటు ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాల్ ఉంటుంది. ఈ హైకోర్టులో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. మొత్తం నాలుగు మార్గాలను ఏర్పాటు చేశారు. న్యాయమూర్తుల కోసం ఒకటి, న్యాయవాదుల కోసం మరొకటి, ఉద్యోగులు వచ్చేందుకు ఒక ప్రవేశ ద్వారం, కక్షిదారులు వచ్చేందుకు మరో ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు.
వెలగపూడిలో ఇప్పటికే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ శాసనమండలి నిర్మాణాలను పూర్తి చేసి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి పాలనను అమరావతికి తరలించారు. అధికారుల నివాసాల ఇప్పటికే టవర్ల నిర్మాణం పూర్తయ్యింది. రూ. 50వేల కోట్ల రూపాయలతో వివిధ భవనాల నిర్మాణం చురుగ్గా సాగుతుంది. సెక్రటేరియట్ కోసం ఐదు శాశ్వత టవర్ల నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. రాజధానిలోని రహదారుల నిర్మాణాలు కూడా 70శాతం పూర్తయ్యింది. హైకోర్టు నిర్మాణానికి కూడా ఆదివారం ప్రారంభోత్సవం జరగుతుండటంతో రాజధానికి ప్రధాన పరిపాలనా విభాగాలన్నీ ఒక్కొక్కటిగా చేరుకున్నాయి. ఒక్కో గ్రాఫిక్.. వాస్తవ రూపంలోకి వస్తోంది.