ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్ పై ఆ మధ్య పవన్ కళ్యాణ్ విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. గంటా శ్రీనివాస రావు ని గెలిపించడంలో తమ పాత్ర గురించి పవన్ కళ్యాణ్ చెప్పడమే కాకుండా, గంటా అవినీతిపై కూడా పవన్ కళ్యాణ్ ఘాటుగా విమర్శించిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా ఈరోజు స్పందించారు.
ప్రజారాజ్యం లో చిరంజీవి కి సన్నిహితుడుగా పేరుపొందిన గంటా శ్రీనివాసరావు, ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయ్యాక మంత్రి పదవి పొందారు. ఆ తర్వాత అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా సన్నిహితుడు గా మారిపోయాడు. తర్వాత మళ్లీ 2014 లో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యారు. అక్కడ మళ్లీ గెలిచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో మంత్రిగా చేస్తున్నారు. అంతేకాకుండా కడప ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ను, ఉప ఎన్నికల సమయంలోనూ, అలాగే కొందరు వైఎస్ఆర్ సీపీ నాయకులను తెలుగుదేశం పార్టీలోకి తీసుకు వచ్చే విషయంలోనూ గంటా శ్రీనివాసరావు కీలక భూమిక పోషించాడని, అందుకే తాను ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు కి కూడా సన్నిహితుడిగా మారిపోయాడని విశ్లేషణలు వెలువడ్డాయి.
అయితే అంతా బాగుంది అనుకున్న సమయంలో ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ వైపు నుంచి గంటా శ్రీనివాసరావు పై విమర్శలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీపై పవన్ కళ్యాణ్ 2018 మార్చి లో తిరగబడిన తర్వాత కూడా మొదట్లో గంటా శ్రీనివాస రావు ని విమర్శించ లేదు. కానీ గత రెండు నెలల నుంచి గంటా పై పవన్ కళ్యాణ్ విమర్శలు మొదలెట్టారు. గంటా శ్రీనివాస్ లాంటి కొంతమంది వ్యక్తుల వల్లే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అవ్వాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ ఆ మధ్య వ్యాఖ్యానించారు. గంటా అవినీతిని హైలెట్ చేయడమే కాకుండా, గంట శ్రీనివాస లాంటి పక్షులని ( అంటే ఏ పార్టీలో కైనా ఇలా వచ్చి అలా వెళ్లి పోయేవాళ్ళు అన్న ఉద్దేశంతో) జనసేన పార్టీ లోకి ఆహ్వానించేది లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ విమర్శలు అన్నింటి మీద గంటా శ్రీనివాసరావు ఇప్పుడు స్పందించారు.
కేవలం పవన్ కళ్యాణ్ వల్లే తాము గెలవలేదని, ఆయన పాత్ర ఎంతో కొంత ఉంటే ఉండవచ్చని గంటా శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు. గంటా ట్వీట్ చేస్తూ, ” మీరు గుంటూరులో జరిగిన మీటింగ్ లో భీమిలి లో నేనే గెలిపించాను అని చెప్పారు, మీరు నా విజయం కోసం ప్రచారం కు వచ్చారు, మీ పాత్ర కూడా ఉంది, దానికి మేము మీకు థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది, అయితే కేవలం మీ వల్లే ఎవరూ గెలవలేదు ” అని రాసుకొచ్చారు.
అలాగే తనను జనసేన పార్టీ లోకి ఆహ్వానించేది లేదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను, జనసేన పార్టీ లోకి వెళ్ళాలని ప్రయత్నించి భంగ పడ్డాడు అని నెటిజన్లు పదేపదే చేసే వ్యాఖ్యలను ఉద్దేశించి గంటా శ్రీనివాసరావు మరొక ట్వీట్ చేశారు. తాను జనసేనలోకి వెళతానని అనుకుంటే అది భ్రమేనని అభిప్రాయపడ్డ గంటా శ్రీనివాసరావు, చంద్రబాబు నాయకత్వంలో తాను చాలా కంఫర్టబుల్ గా పని చేసుకుంటున్నానని ట్వీట్ చేస్తూ, “పవన్ కళ్యాణ్ గారూ, నేను దేశం గర్వించదగ్గ నాయకులు చంద్రబాబు గారి నాయకత్వం లో చాలా చక్క గా పని చేస్తున్నాను, మరి నేను జనసేన లోకి రావలసిన అవసరం గాని అగత్యం గాని నాకు ఉంది అని మీరు అనుకోవడం మీ భ్రమ ” అని రాశారు.
గంటా శ్రీనివాసరావు ట్వీట్ల పై నెటిజన్లు , జనసైనికులు మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు ఓటమి ఖాయమని వారు గంటా శ్రీనివాస రావు ట్వీట్ కు స్పందనగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ వర్సెస్ గంటా శ్రీనివాసరావు మాటల యుద్ధం అలా కొనసాగుతోంది