ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది.. బీజేపీని వ్యతిరేకిస్తూ.. ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు కల్పిస్తున్న రాష్ట్రాల్లో సీబీఐ కార్యకలాపాలు.. పెరిగిపోతున్నాయి. మోడీ, అమిత్ షాలను బెంగాల్‌లో అడుగు పెట్టకుండా.. తీవ్రంగా నిరోధిస్తున్న మమతా బెనర్జీకి.. షాక్ ఇచ్చేందుకు బీజేపీ ద్వయం.. గట్టి ప్రయత్నాలే చేస్తోంది. హఠాత్తుగా.. సీబీఐ కేసు అంటూ.. కోల్‌కతా పోలీస్ కమిషనర్ ఇంటిపైకి.. ఏకంగా నలభై మందికిపైగా సీబీఐ అధికారులు సోదాలకు వచ్చారు. అసలే సీబీఐ విషయంలో కాక మీద ఉన్న బెంగాల‌్ ప్రభుత్వం… తమ రాష్ట్ర పోలీసులతో.. వారిని తరిమికొట్టినంత పని చేసింది. కొంత మందిని అదుపులోకి తీసుకుంది. తర్వాత వదిలి పెట్టింది. ఈ విషయంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేరుగా కేంద్రంపై మండిపడ్డారు.
రోజ్ వ్యాలీ, శారదా పోంజీ స్కాం కేసుల్లో కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కి గతంలోనే సమన్లు జారీ చేశారు. ఆయన స్పందించకపోవడంతో.. అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఎంతకైనా తెగించి…కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్ణయించారు. రాజీవ్ కుమార్‌కు ఆమె ప్రపంచంలోనే అత్యంత నిజాయితీగల అధికారిగా కితాబునిచ్చారు. బీజేపీ లక్ష్యం కేవలం రాజకీయ పార్టీలే కాదని, తమ అధికారాలను దుర్వినియోగపరుస్తూ పోలీసు వ్యవస్థను తమ అధీనంలో ఉంచుకోవాలని భావిస్తున్నారని, అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
నిజానికి సీబీఐని ఉపయోగించుకుని… భారతీయ జనతా పార్టీ చాలా రోజులుగా రాజకీయ ప్రత్యర్థులను వేటాడుతోంది. ఎన్డీఏతో టీడీపీ విడిపోయిన తర్వాత.. ఈడీ, ఐటీ దాడులతో తెలుగుదేశం నేతలపై దాడులు చేయించారు. ఇక సీబీఐ దాడులే తరువాయి అని బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా… సీబీఐకి ఉన్న జనరల్ కన్సెంట్‌ను రద్దు చేశారు. దీంతో కోర్టు ఆదేశాలు ఉంటే తప్ప.. ఏపీలో అడుగు పెట్టలేని పరిస్థితి సీబీఐకి ఉంది.అదే సమయంలో.. ఇతర బీజేపీయేతర రాష్ట్రాలు కూడా దీన్ని ఫాలో అయ్యాయి. కానీ.. గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన కేసుల్లో… విచారణ జరుపుతున్నారు. ఆ కేసులను అడ్డం పెట్టుకుని.. రాజకీయ ప్రత్యర్థుల్ని వేటాడుతున్నారన్న విషయం.. ఎవరికైనా అర్థమైపోతుంది.